Begin typing your search above and press return to search.

సింహపురి రాజకీయం : టీడీపీ....వైసీపీ పోటా పోటీగా...!

ఇపుడు 2024 ఎన్నికల వేళ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 March 2024 2:26 PM GMT
సింహపురి రాజకీయం :  టీడీపీ....వైసీపీ పోటా పోటీగా...!
X

వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా నెల్లూరు. 2011లో వైసీపీ పార్టీ మొదలైనప్పటి నుంచి ఫ్యాన్ నీడనే సేదతీరిన జిల్లా ఇది. 2012లో నెల్లూరు లోక్ సభకు ఉప ఎన్నికలు జరిగితే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇక్కడ నుంచి భారీ ఆధిక్యతతో గెలిచారు. ఆనాడు కాంగ్రెస్ తరఫున టి సుబ్బరామిరెడ్డిని పోటీకి పెట్టినా వైసీపీ గెలిచింది.

అలా సింహపురి రాజకీయం పూర్తిగా వైసీపీకి అనుకూలం అయింది. అది 2014లో కూడా కొనసాగింది. అయితే ఆనాడు వైసీపీకి ఏడు అసెంబ్లీ సీట్లు దక్కాయి. మూడు సీట్లు టీడీపీకి వచ్చాయి. వెంకటగిరి. ఉదయగిరి, కోవూరు టీడీపీ గెలుచుకుంటే మిగిలిన ఏడు సీట్లు వైసీపీ పరం అయ్యాయి.

ఇక 2019 ఎన్నికల్లో చూస్తే మొత్తానికి మొత్తం పది సీట్లూ వైసీపీ ఖాతాలో పడిపోయాయి. కోవూరు, ఉదయగిరి వెంకటరిగిని కూడా టీడీపీ నుంచి వైసీపీ తీసుకుంది. ఇపుడు 2024 ఎన్నికల వేళ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. వైసీపీకి రెండేళ్ల క్రితం నుంచి నెల్లూరు ఇబ్బందికరంగా మారింది. 2022 మొదట్లో అప్పటి మంత్రిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి సడెన్ గా చనిపోవడంతో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది అని చెప్పుకున్నారు.

ఇక 2019 ఎన్నికల దాకా చురుకుగా నెల్లూరు రాజకీయాలలో పాల్గొన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ తరువాత నుంచి పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు. మరో వైపు చూస్తే గౌతం రెడ్డి స్థానంలో విక్రం రెడ్డి ఆత్మకూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సీటు వైసీపీదే. కానీ జిల్లా మొత్తం రాజకీయాన్ని శాసించే పరిస్థితి అయితే మేకపాటి కుటుంబానికి ఈ రోజున లేదు అంటున్నారు. ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు.

అలాగే వైసీపీకి వైఎస్సార్ కుటుంబానికి భక్తుడిగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా సైకిలెక్కేశారు. పెద్దాయన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అయితే టీడీపీలోకి వచ్చేశారు. ఇలా చూస్తే ఏడాది క్రితమే పది నుంచి ఏడుకు వైసీపీ ఎమ్మెల్యేల బలం తగ్గింది.

ఇపుడు ఎన్నికల వేళ అంగబలం అర్ధబలం దండీగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి రావడం మరో దెబ్బ అని అంటున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో నెల్లూరులో బలహీనంగా ఏడాది క్రితం వరకూ ఉన్న టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ రోజున ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీతో పోటాపోటీగా బలాన్ని పెంచుకుంది. నెల్లూరులో మొత్తం పది అసెంబ్లీ సీట్లలో అయిదు సీట్లకు పైగా టీడీపీ గెలుచుకునే పరిస్థితి ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక విధంగా వైసీపీకి నెల్లూరు రాజకీయం ఇబ్బంది పెట్టేదిగా ఉంది అని అంటున్నారు.

రాజకీయ వ్యూహకర్త చాణక్యుడు అయిన విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ సీటుకు ఇంచార్జిగా అధినాయకత్వం నియమించింది. ఆయన కనుక గట్టిగా బిగించి రంగంలోకి దిగితే మాత్రం రాజకీయం రక్తి కడుతుందని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ రోజుకీ గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి బలం ఉంది. కానీ ఆ బలం తో పాటు కీలక నేతలు కూడా ఉండాల్సిన అవసరం ఆలస్యంగా అయినా వైసీపీ హై కమాండ్ గుర్తించింది అని అంటున్నారు. మరి టీడీపీ దూకుడుకు వైసీపీ వేసే పై ఎత్తు ఎలా ఉంటుంది అన్నదే సింహపురి పాలిటిక్స్ ని గమనించే వారిలో ఆసక్తిని పెంచుతోంది.