Begin typing your search above and press return to search.

షర్మిల కోసమేనా టీడీపీ వీక్ క్యాండిడేట్...!?

ఏంటో ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ నుంచి ఏమి జరిగినా అందులో చంద్రబాబు హ్యాండ్ ఉంది అంటారు.

By:  Tupaki Desk   |   4 April 2024 3:43 AM GMT
షర్మిల కోసమేనా టీడీపీ వీక్ క్యాండిడేట్...!?
X

ఏంటో ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ నుంచి ఏమి జరిగినా అందులో చంద్రబాబు హ్యాండ్ ఉంది అంటారు. అది ఆయన రాజకీయ చాణక్యాన్ని మెచ్చి అంటున్నారా లేక విమర్శలు చేస్తున్నారా అన్నది దేవుడికే ఎరుక. ఏపీలో అన్ని పార్టీలు జగన్ అంటే విపరీతమైన కోపంతో ఉన్నాయి. అందులో కుడి ఎడమల తేడా అసలు లేదు. వామపక్షాలు ఇపుడు కాంగ్రెస్ వైపు ఉంటున్నాయి.

బీజేపీతో బాబు చెట్టాపట్టాల్ వేస్తున్నారు. అయినా సరే వామపక్షాలు జగన్ నే విమర్శిస్తున్నాయని వైసీపీ నేతలు వాపోతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే షర్మిల కడప ఎంపీగా పోటీ చేయడం ఆషామాషీగా కాదు దాని వెనెక భారీ స్కెచ్ ఉందని ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు తెర వెనక మద్దతు ఇస్తున్నారు అని కూడా అంటున్నారు. దాని కోసమే టీడీపీ వీక్ క్యాండిడేట్ ని పెడుతోంది అని అంటున్నారు. భూపేష్ రెడ్డి. ఈ పేరు ఎవరైనా ఎపుడైనా విన్నారా. వింటే గింటే జమ్మలమడుగు వాసులు వింటారు. ఎందుకంటే ఆయన అక్కడ టీడీపీ ఇంచార్జ్ కాబట్టి. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి అదినారాయణరెడ్డికి స్వయాన అన్న కొడుకు.

గతంలో ఎమ్మెల్సీగా చేసిన నారాయణరెడ్డి కుమారుడు. ఆది నారాయణరెడ్డి, నారాయణరెడ్డి ఇద్దరూ టీడీపీ గూటికి చేరినా భారీగా లబ్ది పొందింది మాత్రం ఆది అనే అంటారు ఆయన ఏకంగా మంత్రి అయిపోయారు. కడపను రెండేళ్ల పాటు కంట్రోల్ లో పెట్టుకుని ఏలారు టీడీపీ ఓడాక బీజేపీలోకి జంప్ అయి జమ్మలమడుగుని అలా వదిలేశారు.

ఇక ఆనాడు దిక్కు లేని చోట తాను ఉన్నానని నారాయణరెడ్డి కొడుకు భూపేష్ రెడ్డి బరిలోకి దిగి పెద్ద ఎత్తున నిధులు వెచ్చింది మరీ పార్టీని కాపాడుతూ వచ్చారు. ఆయనకే ఎన్నికల్లో టికెట్ అనుకుంటే పొత్తులలో భాగంగా దాన్ని బీజేపీకి ఇచ్చేసి ఆదిని ఎమ్మెల్యే క్యాండిడేట్ చేశారు.

దాని వెనక బాబు హస్తం ఉందని అంటున్నారు. అంతటితో చాలక కడప ఎంపీ సీటుకు బడా నేత ఒకరి పేరుని ముందుగా అనుకుని ఇపుడు ఆ సీటుకు భూపేష్ రెడ్డిని చంద్రబాబు సెలెక్ట్ చేయబోతున్నారు అన్న ప్రచారంతో టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయని అంటున్నారు. ఎందుకంటే భూపేష్ రెడ్డి కొత్తగా వచ్చిన నేత. తొలిసారి పోటీకి జమ్మలమడుగుని ఎంపిక చేసుకున్నారు.

అక్కడ సీటు ఇస్తే గెలిచేందుకు ప్రయత్నించేవారేమో. కానీ అది కాదని ఆయన బాబాయ్ ఆదికి ఇచ్చేసి కుర్రాడిని కడప ఎంపీగా పోటీ చేయించడం అంటే ఏమనుకోవాలని అంటున్నారు. అంటే టీడీపీకి అలా వీక్ క్యాండిడేట్ ని పెట్టి షర్మిల గెలుపు కోసం ఇండైరెక్ట్ గా బాబు సాయం అందిస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు.

కడపలో షర్మిల గెలిస్తే వైసీపీ ఓడితే ఫ్యూచర్ లో టీడీపీ అక్కడ బలపడేందుకు వీలు ఉంటుందని దూర దృష్టితోనే బాబు అలా చేస్తున్నారు అని అంటున్నారు. షర్మిల సైతం ధైర్యంగా కడప ఎంపీ సీటుకు పోటీ చేయడానికి సొంత పార్టీ బలం చూసుకుని కాదని కూడా చెవులు కొరుక్కుంటున్నారుట.

మొత్తం మీద షర్మిల గెలుపుని బాబు భుజాల మీద వేసుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. అదే సమయంలో ముక్కుపచ్చలారని తన కుమారుడు యువ నేత భూపేష్ రెడ్డి రాజకీయాన్ని బలిపెడతారా అని ఆయన తండ్రి నారాయణరెడ్డి ఫైర్ అవుతున్నారు.

తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కావాలంటే కడప ఎంపీ సీటుని ఆదికి ఇవ్వాలని కోరుతున్నారు. ఆదికి ఇస్తే ఆయన బలమైన నేత. అందువల్ల ఆయన ఓట్లను చీలుస్తారు. దాంతో వైసీపీకి మేలు జరుగుతుందనే ఇలా మార్చారు అని స్వపక్షంలో విపక్షంలో కూడా చర్చ సాగుతోందిట.మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది అంటున్నారు.