Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన చోట చరిత్ర పుటల్లోకి టీడీపీ...!

ఆనాడు అంటే 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేవలం నలభై మంది సన్నిహితుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పేరుని ప్రకటించి ఉమ్మడి ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ సంచలనం రేపిన వారు ఎన్టీయార్.

By:  Tupaki Desk   |   31 Oct 2023 5:27 PM GMT
చరిత్ర సృష్టించిన చోట చరిత్ర పుటల్లోకి టీడీపీ...!
X

తెలుగుదేశం పుట్టిందే తెలంగాణాలో. ఆనాడు అంటే 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేవలం నలభై మంది సన్నిహితుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పేరుని ప్రకటించి ఉమ్మడి ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ సంచలనం రేపిన వారు ఎన్టీయార్.

ఇక మరో విశేషం కూడా చెప్పుకోవాలి. తెలుగుదేశానికి ఉమ్మడి ఏపీ కంటే కూడా తెలంగాణాలోనే బలం ఎక్కువ. ఏపీలో ఎపుడూ తెలంగాణా కంటే తక్కువ సీట్లే వచ్చాయి. 1983 నుంచి చూసుకుంటే తెలంగాణా ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించినంతగా ఏపీ రీజియన్ ఆదరించలేదు. ఏపీలో కాంగ్రెస్ కి బలం ఎక్కువగా ఉండేది. పైగా ఇతర ఉన్నత సామాజిక వర్గాలు ఏపీలో కాంగ్రెస్ కి బలపరిస్తే తెలంగాణాలో బీసీలు పెద్ద ఎత్తున తెలుగుదేశం జెండాను మోశారు.

ఫలితంగా కాంగ్రెస్ ఎపుడు అధికారంలోకి వచ్చిన ఏపీ మీద ఆధారపడేది. తెలుగుదేశం ఎపుడు ఎక్కువ సీట్లు తెచ్చుకున్నా తెలంగాణా అండగా నిలిచేది. ఈ హవా 2014 దాకా కొనసాగింది. 2014లో సైతం తెలంగాళాలో టీడీపీ పోటీ చేస్తే పదిహేను సీట్లను తెలుగుదేశం గెలుచుకుంది. అలాగే 14.7 శాతం ఓటింగ్ షేర్ దక్కించుకుంది.

అదే కాంగ్రెస్ కి 21 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ కంటే ఆరు మాత్రమే ఎక్కువ అన్న మాట. చాలా చోట్ల రెండవ స్థానంలో ఉంది. తక్కువ ఓట్లతో ఓడిన సీట్లు కూడా అప్పట్లో టీడీపీకి ఉన్నాయి. అదే టీడీపీ 2018కి వచ్చేసరికి చిక్కి శల్యం అయింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసి రెండు సీట్లు మాత్రమే సాధించింది. ఓట్ల షేర్ కూడా జస్ట్ 3.5 శాతానికి పడిపోయింది.

గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ కాపాడుకోలేకపోయింది అన్నది ఒక వైఫల్యం అయితే అతి తెలివితో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఆ ఎన్నికల్లో ఓటుకు నోటుకు తెర తీయడమే టీడీపీ కొంప ముంచింది అని అంటారు. ఫలితంగా చంద్రబాబు తెలంగాణా నుంచి ఏపీకి వెళ్ళిపోయారు. పార్టీని కూడా పట్టించుకోకుండా వదిలేశారు. అలా వదిలేసిన బాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 2018లో టీడీపీని తానే చావు దెబ్బ తీశారని అంటారు.

ఇక 2018 తరువాత నాలుగేళ్ళ పాటు తెలంగాణా టీడీపీని అలా వదిలేసిన బాబు ఎన్నికలకు కొంతకాలం ముందు మళ్ళీ తట్టి లేపారు. కాసాని జ్ఞానేశ్వర్ ని తీసుకుని వచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేశారు. బీసీ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కాసాని పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డారు. ఈసారి బీయారెస్ కి ఆదరణ తగ్గిన నేపధ్యం ఉంది. ఈ దశలో పోయిన తమ ఓటు బ్యాంక్ ని బీయారెస్ నుంచి తెచ్చుకోవాల్సిన కీలక సమయంలో చంద్రబాబు పోటీకి నో చెప్పి అస్త్ర సన్యాసం చేశారు అని విమర్శలు ఉన్నాయి.

దీంతో టీడీపీ ఓటు బ్యాంక్ ఎక్కువగా కాంగ్రెస్ కి ఈసారి వెళ్తుంది అని అంటున్నారు. ఇదంతా లోపాయికారీ ఒప్పదంలో భాగమని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్టీయార్. పార్టీ పెట్టిన చోట టీడీపీ ఎన్నికలలో పోటీ చేయకుండా కూర్చోవడం ఇది ఫస్ట్ టైం. ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగానని చెప్పుకుంటున్న టీడీపీ ఏపీలో ఇలాగే చేసింది. లోకల్ బాడీ ఎన్నికల వేళ జెడ్పీటీసీలకు పోటీ చేయకుండా దూరం పాటించింది.

ఇపుడు కూడా ఏకంగా తెలంగాణా సార్వత్రిక ఎన్నికలనే దూరం పెట్టింది. ఏ పార్టీ అయినా ఎన్నికల కోసమే పనిచేస్తుంది. అధికారం తీసుకోవాలని చూస్తుంది. కనీసం తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. కానీ టీడీపీ అధినాయకత్వం షార్ట్ కట్ మెదడ్స్ కి వెళ్తోంది. ఈసారికి బీయారెస్ ని ఓడిస్తే 2028 నాటికి తమకు అవకాశం ఉంటుందని భ్రమిస్తోంది.

కానీ ఒకసారి సైకిల్ గుర్తు మరచిన వారు మళ్లీ వెనక్కి ఎలా వస్తారని అనుకుంటోంది అన్నది పెద్ద ప్రశ్న. బీసీలకు ఆయువు పట్టుగా ఉంటూ బీసీలు ఎక్కువగా ఉన్న స్టేట్ లో పోటీ నుంచి తప్పుకోవడం టీడీపీ చారిత్రాత్మక తప్పిదం అంటున్నారు. తెలంగాణాలో టీడీపీ పెట్టి ఎన్టీయార్ చరిత్ర సృష్టిస్తే చంద్రబాబు అదే టీడీపీని చరిత్రగా మార్చారని కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.