Begin typing your search above and press return to search.

టీడీపీకి వ్యూహకర్తగా పీకేని కంఫర్మ్ చేస్తున్నారా...!?

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే రాబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం అయితే అలాగే సాగుతోంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:13 PM GMT
టీడీపీకి వ్యూహకర్తగా పీకేని కంఫర్మ్ చేస్తున్నారా...!?
X

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే రాబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం అయితే అలాగే సాగుతోంది. పీకే 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆయన తెలంగాణాలో కూడా అధికార బీఆర్ఎస్ కి వ్యూహకర్తగా కొంతకాలం సేవలు అందించారు. ఆ తరువాత ఎందుకో తప్పుకున్నారు అని టాక్ నడచింది. తిరిగి ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉండగా హడావుడిగా పీకేని బీఆర్ ఎస్ అధినాయకత్వం రప్పించి ఫైనల్ ఫైటింగ్ కోసం సలహాలు తీసుకుందని ప్రచారం జరిగింది.

మొత్తానికి తెలంగాణాలో బీఆర్ ఎస్ ఓడింది. ఇక పీకే శిష్య బృందం తెలుగు రాష్ట్రాలలో ఇపుడు తమ సేవలను అందిసోంది. కాంగ్రెస్ కి సునీల్ కనుగోలు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నియమితులై ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. వైసీపీకి ఏపీలో ఐప్యాక్ టీం వర్క్ చేస్తోంది.

ఇక పీకే బీహార్ లో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. కానీ అక్కడ ఆయనకు అనుకున్న స్పందన అయితే జనాల్లో రాలేదు. దాంతో ఆయన తన ఎన్నికల వ్యూహకర్త పాత్రలోకే మారాలని చూస్తున్న వేళ తెలుగుదేశం నుంచి ఆయనకు భారీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆ మధ్యన చంద్రబాబు జైలులో ఉన్న టైం లో నారా లోకేష్ ఎక్కువగా ఢిల్లీలో గడిపేవారు. ఆ టైం లో పీకేతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడినట్లుగా చెబుతున్నారు. దాంతో ఆయన పీకేని టీడీపీకి వ్యూహకర్తగా తీసుకోవాలని తండ్రి చంద్రబాబుకు గట్టిగా చెప్పారని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ వచ్చిన పీకేని టీడీపీకి ఇప్పటికే వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ కలిశారు. అసలు ఈయన కూడా పీకే టీం మెంబర్ గా ఒకనాడు ఉన్న వారే. దీంతో ఇద్దరి మధ్యన ఏపీ పాలిటిక్స్ విషయం చర్చకు వచ్చినట్లుగా తెలిసింది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే గ్రౌండ్ లెవెల్ లో రాబిన్ శర్మ టీం తో పాటు పీకే టీం కూడా ఇక మీదట పనిచేస్తుందని తెలుగుదేశం వర్గాల నుంచి ప్రచారంగా ఉంది. పీకే 2019లో జగన్ వైపు ఉండి గెలిపించారు. ఇపుడు ఆశ్చర్యకరంగా టీడీపీ వైపు ఆయన ఉంటారా అన్న ప్రశ్నలు అయిఏ ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. అలాగే ఎన్నికల వ్యూహకర్తలు కూడా అదే రాజకీయాల్లో మునిగి తేలుతున్న వారు కాబట్టి వారు ఎటు వైపేనా ఉంటారు అని అనుకోవచ్చు.

ఇక పీకేకు ఇటీవల కాలంలో శిష్య బృందాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఎదురు అవుతోంది. మొదట్లో వారిని పెట్టుకుని విజయాలు సాధించిన పీకే ఇపుడు వారంతా వేరు పడడంతో ఏమీ కాకుండా పోయారు అని అంటున్నారు. మళ్లీ పీకే ఇపుడు ఫీల్డ్ లోకి వచ్చినా మునుపటి జోరు చూపించగలరా అన్నది చర్చగా ఉంది. వీటి కంటే ముందు ఒకనాడు వైసీపీతో పీకేని కలిపి విమర్శించిన టీడీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ ఇపుడు పీకే సేవలు తీసుకుంటుందా అన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది. దీని మీద అఫీషియల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది అని అంటున్నారు.