Begin typing your search above and press return to search.

గౌతు ఫ్యామిలీకి టీడీపీ షాక్...!?

ఆయన తన రాజకీయ వారసురాలిగా కుమార్తె గౌతు శిరీషను ఉంచారు. ఆమెకు 2019లో టీడీపీ పలాస టికెట్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 3:57 AM GMT
గౌతు ఫ్యామిలీకి టీడీపీ షాక్...!?
X

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా పేరుమోసిన గౌతు ఫ్యామిలీకి ఈ ఎన్నికల్లో బిగ్ షాక్ తగలనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి. సర్దార్ గౌతు లచ్చన్న నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది లచ్చన్న మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసుడిగా గౌతు శ్యామ సుందర శివాజీ సైతం ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు.

ఆయన తన రాజకీయ వారసురాలిగా కుమార్తె గౌతు శిరీషను ఉంచారు. ఆమెకు 2019లో టీడీపీ పలాస టికెట్ ఇచ్చింది. అయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఏ రాజకీయ నేపధ్యం లేని డాక్టర్ సీదరి అప్పలరాజుని జనాలు జై కొట్టి గెలిపించారు. జగన్ వేవ్ లో సైతం అది సాధ్యపడింది. ఆ మీదట ఏడాది తిరగకుండానే సీదరి అప్పలరాజు మంత్రిగా కూడా అయిపోయారు.

ఆయనకు జగన్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అంతే కాదు పలాసలోనే పోర్టు నిర్మాణం పనులు సాగుతున్నాయి. కిడ్నీ బాధితులకు వంశధార ఎత్తిపోతల పధకం ద్వారా రక్షిత మంచినీరు అందిస్తున్నారు. సూపర్ స్పెషల్ ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఇవన్నీ తమ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు అని మంత్రి సీదరి చెప్పుకుని మరోసారి గెలిచేందుకు చూస్తున్నారు.

ఆయన్ని ఈసారి ఎలాగైనా ఓడించాలని గౌతు ఫ్యామిలీ చూస్తోంది. టికెట్ తమకే ఇస్తారని ఆశపడుతోంది. అయితే అనూహ్యంగా పలాస టికెట్ ని జనసేనకు కేటాయిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రెండు సీట్లను జనసేనకు ఇవ్వబోతున్నారు అని అందులో ఒకటి పలాస అని ప్రచారం వైరల్ కావడంతో గౌతు అనుచరులు అందోళన పడుతున్నారు. నిజంగా ఇలాగే జరుగుతుందా అన్న చర్చ కూడా వస్తోంది.

ఇక వైసీఎపీ ఎంపీ టికెట్ ఆశించిన డాక్టర్ దానేటి శ్రీధర్ జనసేనలోకి వెళ్ళి మరీ పలాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు అంటున్నారు. ఆయన టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేశారు. అలాగే వైసీపీ అయినా టికెట్ ఇస్తుందని భావించారు ఇపుడు జనసేన ద్వారా తన కోరిక తీర్చుకోవాలని చూస్తున్నారు.

సీట్ల సర్దుబాటులో భాగంగా పలాస సీటుని జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే మంత్రి సీదరిని ఓడించాలంటే జనసేనతో కలసి వెళ్లడమే మార్గం అని ఆలోచిస్తున్నారుట. ఇక పలాసలో గౌతు శిరీష గ్రాఫ్ పెంచుకోలేకపోయారు అని అంటున్నారు. దాంతో పాటు గట్టిగా ఈసారి పోరు ఉంటుందని దాన్ని తట్టుకోవాలంటే పొత్తులో జనసేన కోరిన సీట్లు ఇచ్చి మొత్తం శ్రీకాకుళం సీట్లు గెలుచుకోవాలని వైసీపీ అలోచిస్తోందిట.

అదే కనుక జరిగితే మాత్రం గౌతు ఫ్యామిలీకి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోతుందా అన్న కలవరం అయితే ఆ కుటుంబ అనుచరులలో ఉంది. ఈసారికి శిరీషకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా నెగ్గితే ఆమె మరింత కాలం రాజకీయలలో ఉంటారని అలా కాకుండా ఇక్కడే బ్రేకులు పడితే మాత్రం దశాబ్దాల గౌతు కుటుంబ రాజకీయానికి ముగింపు పలికినట్లేనా అన్న చర్చ వస్తోంది.