Begin typing your search above and press return to search.

రెబెల్స్ తో టీడీపీకి డేంజర్ బెల్స్ !?

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రాలో ఎన్నడూ లేని విధంగా రెబెల్స్ తో డేంజర్ బెల్స్ మోగనున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది.

By:  Tupaki Desk   |   16 April 2024 4:03 AM GMT
రెబెల్స్ తో టీడీపీకి డేంజర్ బెల్స్ !?
X

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రాలో ఎన్నడూ లేని విధంగా రెబెల్స్ తో డేంజర్ బెల్స్ మోగనున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. పెందుర్తి సీటు విషయంలో తనకు దక్కనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఎక్కడా తగ్గలేదు. ఆయనలో అసంతృప్తి అలాగే ఉంది. ఏకంగా బాబుతోనే వాదోపవాదం చేసిన మీదట బండారు ఆయనకే ఒక పెద్ద నమస్కారం పెట్టేసి బయటకు వచ్చారు.

అంటే పెందుర్తిలో ఆయన జనసేన అభ్యర్ధిని సహకరించరు అనే అంటున్నారు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీలో ఉన్నపుడు కూడా 2014, 2019లలో పెందుర్తి టికెట్ అడిగినా బండారు అడ్డుకున్నారు. తమ ఇలాకాలో ఎలా అని నాడు బ్రేకులేశారు. కానీ పంచకర్ల ఈసారి వ్యూహం మార్చారు జనసేనలో చేరి పొత్తుల పేరుతో సీటు సాధించారు.

దాంతోనే బండారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బండారుకు ఈసారికి ఎందుకు పట్టుదల అంటే ఆయనకు రాజకీయ వారసుడు ఉన్నారు. తన కుమారుడికి పెందుర్తి సీటుని ఆయన కేటాయించాలని చూస్తున్నారు. పంచకర్ల కనుక గెలిస్తే ఇక సొంత సీటుగా భావించి అక్కడే కుదురుకుపోతారు. అందుకే పొత్తులు అని కూడా చూడకుండా బండారు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ఆయన వీలైనంతవరకూ సహాయ నిరాకరణ చేసి ఓడించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. అదే జరిగితే ఈ సీటు వైసీపీకే అని అంటున్నారు

అదే విధంగా మాడుగుల సీటు విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు రెబెల్ గా పోటీకి దిగబోతున్నారు అని అంటున్నారు. ఆయన పోటీకి దిగితే కచ్చితంగా వైసీపీకే లాభం. ఇప్పటికే బలం ఉన్న వైసీపీకి గవిరెడ్డి బంపర్ మెజారిటీ ఇచ్చేలా చూస్తారు అని అంటున్నారు. గవిరెడ్డి 2009లో ఈ సీటు నుంచి గెలిచారు. దాంతో ఆయన ఈసారి టికెట్ దక్కలేదని పార్టీ పెద్దల మీద మండిపోతున్నారు ఆయన షాకింగ్ డెసిషన్ దిశగా సాగుతున్నారు అని అంటున్నారు.

అదే విధంగా విజయనగరంలో మాజీ ఎమంల్యే మీసాల గీత టీడీపీకి రాజీనామా చేయాలని చూస్తున్నారు. ఆమె 2014లో టీడీపీ తరఫున ఈ సీటు నుంచి గెలిచారు. సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు 2019లో టికెట్ దక్కాలి. కానీ ఇవ్వలేదు. ఈసారి ఇస్తామని నాడే హామీ ఇచ్చారుట. కానీ మరోసారి అశోక్ గజపతిరాజు చక్రం తిప్పి తన కుమార్తెకు టికెట్ ఇప్ప్పించుకున్నారు. దాంతో ఆగ్రహంగా ఉన్న మీసాల గీత ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు.

విజయనగరం అసెంబ్లీ సీటులో మొత్తం అరవై నుంచి డెబ్బై వేల దాకా తూర్పు కాపులు ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత పోటీలో ఉంటే అది వైసీపీకి నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే రెబెల్స్ ఇంకా చాలా మంది ఉత్తరాంధ్రాలో టీడీపీకి డేంజర్ బెల్స్ మోగించేలా ఉన్నారు అని అంటున్నారు.