Begin typing your search above and press return to search.

టీడీపీకి అక్కడ ముందే ఓటమి....!

తెలుగుదేశం పార్టీని రాజకీయ పార్టీగా ఎన్టీయార్ పెట్టి ఉండవచ్చు. కానీ నాలుగు దశాబ్దాల క్రితం దాన్ని జనాలు అలా చూడలేదు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:08 AM GMT
టీడీపీకి అక్కడ  ముందే ఓటమి....!
X

తెలుగుదేశం పార్టీని రాజకీయ పార్టీగా ఎన్టీయార్ పెట్టి ఉండవచ్చు. కానీ నాలుగు దశాబ్దాల క్రితం దాన్ని జనాలు అలా చూడలేదు. ఒక సామాజిక ఉద్యమంగా చూసారు. ఒక రాజకీయ చైతన్యంగా చూసారు. అప్పటిదాకా ఉన్న ట్రెడిషనల్ పాలిటిక్స్ మీద సంధించిన ఒక అస్త్రంగా చూశారు. టీడీపీ హిస్టరీలోనే ప్రభంజనం అన్నది ఉంది. టీడీపీ అంటేనే ఒక విప్లవం. ఒక కొత్త మార్పు. ఇలా ఎన్ని అయినా చెప్పుకోవచ్చు.

అలాంటి టీడీపీ ఎన్టీయార్ జమానా నుంచి చంద్రబాబు జమానాకు మారినపుడు ఏమి జరిగింది అని ఆలోచిస్తే అలా నెమ్మదిగా తనను తాను తగ్గిపోతూ కుంచించుకుపోతోంది అని చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పుట్టింది తెలంగాణాలో. అలాంటి చోట ఈ రోజు టీడీపీ లేదు. దానికి కారణం ఎవరూ అంటే నేటి అధినాయకుడు చంద్రబాబు అనే చెబుతారు.

ఇక ఏపీలో ఏమైనా వైభవంగా ఆ పార్టీ ఉందా అంటే అయిదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో తప్పులు జరిగినా కూడా ఒంటరిగా నిలిచి పోరాడే శక్తితో టీడీపీ లేదు అంటేనే అందులో మరో ఓటమి కనిపిస్తోంది. పొత్తులతోనే టీడీపీ రేపటి ఎన్నికలను ఎదుర్కోబోతోంది. అధికారం దక్కుతుందా లేదా అన్నది జనాల తీర్పు బట్టి ఉంటుంది. ఒకవేళ దక్కినా మునుపటి దర్పం దర్జా పొత్తు పార్టీలతో కూడిన ప్రభుత్వంలో ఉంటాయా అన్నది మరో ప్రశ్న.

ఇదిలా ఉంటే 2019లో 23 సీట్లకే పరిమితం కావడం టీడీపీ హిస్టరీలోనే ఒక ఘోర పరాజయం. ఇపుడు పెద్దల సభలో టీడీపీ పూర్తిగా ఖాళీ కాబోతూండడం మరో దారుణ పరాజయంగా చెబుతున్నారు. టీడీపీకి ఉన్న ఒకే ఒక రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఏప్రిల్ 2తో పదవీ విరమణ చేయబోతున్నారు. దాంతో టీడీపీ పెద్దల సభలో జీరో కాబోతోంది.

టీడీపీ పెట్టాక రాజ్యసభలో ఇలా కావడం ఇదే ఫస్ట్ టైం. ఆ ఓటమిని నివారించుకునేందుకు తప్పనిసరిగా టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలి. చేస్తే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే టీడీపీకి నికరంగా ఉన్నవి 18 మంది ఎమ్మెల్యేలే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే రాజ్యసభకు నెగ్గుతారు. అంటే మరో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.

ఇపుడున్న పరిస్థితులలో ఎంతగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేల మద్దతు తెచ్చినా కుదిరేది కాదు. ఇక ఈ వ్యవహారం బెడిసి పెట్టిన అభ్యర్థి ఓడితే సార్వత్రిక ఎన్నికలముందు అంతకంటే పరువు తక్కువ పని మరోటి ఉండదు. మొత్తానికి చంద్రబాబుకు వెనక ఒక ఓటమి ముందు ఒక ఓటమి అయితే కనిపిస్తున్నాయి. ఆయన ఏమి ఆలోచిస్తారు అన్నది ఒకటి రెండు రోజులలో తేలిపోతుంది.