Begin typing your search above and press return to search.

రేవంత్ మీటింగ్ కి టీడీపీ ఎంపీలు డుమ్మా...!

ఈ విధంగా చూస్తే దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు రేవంత్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యాయని చెప్పాలి.

By:  Tupaki Desk   |   20 Dec 2023 10:37 AM GMT
రేవంత్ మీటింగ్ కి టీడీపీ ఎంపీలు డుమ్మా...!
X

తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి ఢిల్లీ వెల్ళిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీలకు పార్టీ ఇచ్చారు. ప్రత్యేకించి మల్కాజ్ గిరి ఎంపీగా నాలుగున్నరేళ్ల పాటు పనిచేసిన రేవంత్ రెడ్డి సాటి ఎంపీ స్నేహితులకు మంచి పార్టీ ఇచ్చారు. చిత్రమేంటి అంటే ఈ భేటీకి టీడీపీ ఎంపీలు డుమ్మా కొట్టారు. వైసీపీ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అంతే కాదు కాంగ్రెస్ బీజేపీ సహా ఇతర పార్టీల ఎంపీలు కూడా హాజరు కావడం విశేషం. ఈ విధంగా చూస్తే దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు రేవంత్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యాయని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీ మనిషిగా ఉన్నారు. అంతే కాదు ఆయనను ఈ రోజుకీ టీడీపీకి దగ్గర అని అనుకున్న వారికి ఆ దిశగా ప్రచారం సాగుతున్న నేపధ్యానికి చెక్ పెట్టే విధంగా రేవంత్ రెడ్డి పార్టీకి టీడీపీ ఎంపీలు గైర్ హాజరు కావడం విశేషం.

ఇదిలా ఉంటే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తమ వాడు అని టీడీపీ అనిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది అని అంటున్నారు. అయితే రాజకీయంగా రాటుదేలిన రేవంత్ రెడ్డి మాత్రం ఈ తరహా ప్రచారానికి ఆదిలోనే చెక్ పెట్టేలా వ్యవహరించారు అని అంటున్నారు. పైగా ఇటువంటి వాటి వల్ల లేని పోని విమర్శలు తలకెత్తుకోవడం దేనికి అన్న ఆలోచనతోనే ఆయన ఉన్నారు

ఇక తెలంగాణా సెంటిమెంట్ ని ఎపుడైనా రాజేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీంతో పాటు తన లాంగ్ టెర్మ్ పొలిటికల్ కెరీర్ కి బాటలు వేసుకునే యోచనలో ఉన్న రేవంత్ రెడ్డి పక్కా కాంగ్రెస్ మనిషిగానే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్‌రావు, వల్లభనేని బాలశౌరి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీత, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్‌, ఆదాల ప్రభాకరరెడ్డి, చింతా అనూరాధ, బీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, ఎన్ రెడ్డెప్ప తోపాటు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాణికం ఠాగూర్‌, కార్తీ చిదంబరం, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ, శశి థరూర్‌, గౌరవ్‌ గొగొయ్‌, దీపేందర్‌ హుడా, హిబి ఇడెన్‌ హాజరయ్యారు.

అదే విధంగా కాంగ్రెస్ కి చెందిన శశిధరూర్, భారతీయ జనతాపార్టీ నుంచి సీఎం రమేశ్‌, టీఎంసీకి చెందిన సౌగత్‌ రాయ్‌, ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్‌ పటేల్‌, డీఎంకేకు చెందిన కళానిధి, బీఎస్పీకి చెందిన డానిష్‌ అలీ, రితేశ్‌ పాండే తదితరులు ఈ విందులో పాలుపంచుకున్నారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వచ్చిన వారిని చూస్తే ఆయన అందరి వాడు అనిపించుకున్నారు అని అర్ధం అవుతోంది. ఆయన మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రి బ్రాండ్ తప్ప పాత పార్టీ వాసనలు కానీ టీడీపీ చాయలు కానీ ఏ మాత్రం ఉండబోవని అంటున్నారు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి తన పొలిటికల్ స్టైల్ ని కొనసాగిస్తారు అని అంటున్నారు.