Begin typing your search above and press return to search.

విజయవాడ మీద ఒట్టు అంటున్న టీడీపీ ఎంపీ కేశినేని

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:46 PM GMT
విజయవాడ మీద ఒట్టు అంటున్న టీడీపీ ఎంపీ కేశినేని
X

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. చాలా విషయాలలో ఆయన బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అది ఆయన రాజకీయానికి ఇబ్బంది అయినా కూడా అసలు ఆలోచించరు. అందుకే ఆయన తరచూ చిక్కుల్లో పడుతూ ఉంటారు.

ఇక ఆయన 2014లో తొలిసారి టీడీపీ తరఫున ఎంపీగా అయిదు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఇక 2019లో జగన్ వేవ్ లో భారీ పోటీని తట్టుకుని మరీ ఎనిమిది వేల పై చిలుకు మెజారిటీతో కేశినేని నాని గెలిచారు. అయితే నాటి నుంచే ఆయనకూ ధినాయకత్వానికి మధ్య బిగ్ గ్యాప్ ఏర్పడినట్లుగా ఉంది.

తనకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించకపోవడం పట్ల నాని అలిగారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. దాంతో పాటు తనకు తగిన గౌరవ మర్యాదలు సొంత పార్టీలో దొరకడంలేదు అన్న భావనతో ఆయన ఉన్నారని చెప్పుకోవడం జరిగింది.

నాని సైతం ఒక్కసారి ఎంపీ అయ్యాక వైసీపీ అయినా టీడీపీ అయినా ఒక్కటే రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేయడమే కర్తవ్యం అంటూ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా వివాదం అయ్యాయి. ఈ క్రమంలోనే నానికి లొకల్ గా ఉండే టీడీపీ లీడర్స్ కి మధ్య అంతర్గత సమరం కూడా సాగుతోంది అని వార్తలు వచ్చాయి. సాక్ష్తాత్తూ ఎంపీ కుమార్తెను విజయవాడ మేయర్ పదవికి పోటీగా పెడితే ఆమెను సొంత పార్టీ వారే ఓడించారు అని నాని డౌట్ పడ్డారని ఆ కోపం ఆక్రోశం ఆయనలో ఉందని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది.

మరో వైపు చూస్తే నానికి పోటీగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెచ్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీలో వినిపిస్తోంది. ఇక లోకేష్ ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పాదయాత్ర చేసినపుడు మొత్తం ఏర్పాట్ల నుంచి అన్నీ చూసుకున్నది కేశినేని చిన్ని మాత్రమే అని అందరికీ తెలిసిందే. ఆయనకు పార్టీ నుంచి తగిన హామీ ఉందని అందుకే ఆయన ఈ విధంగా జోరు చూపిస్తున్నారు అని అంటున్నారు.

అయితే లోకేష్ పాదయాత్రలో కనిపించని కేశినేని నాని చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయన పక్కనే ఉంటూ అందరికీ షాకిచ్చారు. కేశినేని నాని టీడీపీలో ఉండరని పార్టీ మారుస్తారని ప్రచారం ఒక వైపు సాగిన వేళ ఆయన బాబుకు విధేయుడిగానే ఉంటూ వచ్చిన తీరు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా కేశినేని నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు.

వచ్చే ఎన్నికల్లో అంటే 2024లో తానే విజయవాడ నుంచి తిరిగి ఎంపీగా పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. అంతే కాదు మూడవసారి వరసగా గెలిచి హ్యాట్రిక్ ఎంపీ అనిపించుకుంటాను అని చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఆయన టీడీపీ నుంచి పోటీకి రెడీగా ఉన్నారని అంటున్నారు. కేశినేని చిన్ని కాకుండా మళ్లీ నానినే అధినాయకత్వం టికెట్ ఇస్తుందా అన్నదే చర్చకు వస్తున్నవిషయం.

ఒకవేళ నానికి టికెట్ ఇస్తే చిన్ని పరిస్థితి ఏంటి అన్నది మరో చర్చగా ఉంది. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న టీడీపీ నేతలు నానికి ఎంతవరకూ సహకరిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే నాని తాను మళ్ళీ పోటీ చేస్తున్నాను అది కూడా విజయవాడ నుంచి అని మాత్రమే అన్నారు. ఆయన పోటీ చేసే పార్టీ ఏది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తానికి విజయవాడ రాజకీయాలలో నాని మార్క్ సంచలనం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందని అంటున్నారు. అదేంటి ఎలా ఉంటుంది అన్నది మాత్రం తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయక తప్పదు అంటున్నారు.