Begin typing your search above and press return to search.

టీడీపీ మాస్టర్ ప్లాన్ : ఉత్తరాంధ్రా టార్గెట్ గా లక్షలాది జనంతో...!

ఎన్నికలు ఇంకా మూడు నెలల సమయం ఉండగా ఇప్పటి నుంచే ఎందుకు అంటే ప్రతిపక్షం ముందస్తుగా తయారు కావాల్సిందే అన్నది బాబు ఆలోచన. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా మీద టీడీపీ టార్గెట్ ఉంది.

By:  Tupaki Desk   |   17 Dec 2023 3:56 AM GMT
టీడీపీ మాస్టర్ ప్లాన్ :  ఉత్తరాంధ్రా టార్గెట్ గా లక్షలాది జనంతో...!
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నగరాను ఈ నెల 20వ తేదీన మోగించనున్నారు. ఎన్నికలు ఇంకా మూడు నెలల సమయం ఉండగా ఇప్పటి నుంచే ఎందుకు అంటే ప్రతిపక్షం ముందస్తుగా తయారు కావాల్సిందే అన్నది బాబు ఆలోచన. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా మీద టీడీపీ టార్గెట్ ఉంది. ఈసారి గణనీయంగా అక్కడ ఓట్లూ సీట్లు తెచ్చుకుంటే అధికారం గ్యారంటీ అని టీడీపీ భావిస్తోంది.

అందుకే ఉత్తరాంధ్రాలో నడిబొడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎంచి మరీ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను అక్కడ నిర్వహిస్తున్నారు. భోగాపురం ప్రాంతం అంటే అటు విశాఖ ఇటు శ్రీకాకుళం మధ్యన ఉంటుంది. అలాగే విజయనగరం జిల్లాలో ఉంది. సో అలా చూసుకుంటే ఉత్తరాంధ్రా మధ్యస్థాన్నే టీడీపీ రాజకీయ వేదికగా చేసుకుంది.

విజయనగరం జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మొత్తానికి మొత్తం తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు ఫ్యాన్ పార్టీ పరం అయ్యాయి. దాంతో ఈసారి దాన్ని రివర్స్ చేయాలని టీడీపీ సంకల్పించింది. అందుకే విజయనగరం జిల్లాలోని భోగాపురాన్ని ఎంచుకుందని అంటున్నారు.

అదే విధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే ఎనిమిది సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. టీడీపీ గెలిచింది జస్ట్ రెండు సీట్లు మాత్రమే. ఇక విశాఖలో పదిహేను ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు ఉంటే టీడీపీ గెలిచింది కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్లనే అది కూడా విశాఖ సిటీ పరిధిలోనే.

దాంతో మూడు జిల్లాలలో మెజారిటీ సీట్లు సాధించాలని టీడీపీ చూస్తోంది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో కనీసంగా ఇరవై సీట్లు అయినా రాకపోతే రేపటి రోజున ఏపీలో అధికారం దక్కదు అన్నది టీడీపీకి తెలుసు అని అంటున్నారు. అందుకే ఉత్తరాంధ్రా మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని అంటున్నారు. ఇక యువగళం ముగింపు సభ నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించాలని టీడీపీ ఆరాటపడుతోంది.

ఏకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు విశాఖ చేరుకునేందుకు వీలుగా రైళ్ళను అద్దెకు తీసుకుంటొంది. అటు రాయలసీమ మరో వైపు దక్షిణాంధ్ర ఇంకో వైపు కోస్తా జిల్లాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు నలు వైపుల నుంచి రైళ్ళను వేస్తోంది.

అలా అయిదు లక్షల మంది జనంలో ముగింపు సభను నిర్వహించాలని టీడీపీ ఆలోచిస్తోంది. విశాఖ రాజధాని చేస్తామంటే టీడీపీ నో చెప్పింది అని ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ కామెంట్స్ చేశారు. విశాఖ వాసుల కోరికకు టీడీపీ మోకాలడ్డుతోంది అన్న భావన కొన్ని సెక్షన్లలో ఉంది. వైసీపీ సైతం దాన్ని బలపరచేలా మాట్లాడుతోంది. టీడీపీని నిందిస్తోంది.

మరి ఈ యువగళం ముగింపు సభలో చంద్రబాబు ఉత్తరంధ్రా గురించి విశాఖ రాజధాని గురించి ఏమి మాట్లాడుతారు అన్నది చూడాలి.అలాగే బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తాంధ్రా ప్రాంతంలో ఆయా వర్గాల కోసం ఏమి హామీలు ఇస్తారు అన్నది కూడా చూడాలి. మొత్తానికి యువగళంతో చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు అని టీడీపీ అంటోంది. మరి దీనికి ధీటుగా వైసీపీ ఏమి చేయనుంది అన్నది తరువాత చూడాల్సి ఉంది.