Begin typing your search above and press return to search.

ఇన్ని ఏడుపులు మంచివేనా బాబూ ?

నిజమే పార్టీ అన్నాక టికెట్ అందరికీ ఇవ్వలేరు. కానీ ఆశపెట్టి అయిదేళ్లూ పనిచేయించుకోవడం ఆనక తీసి అవతల పెట్టడం వల్లనే వారంతా అరచి గోల పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   12 April 2024 3:43 AM GMT
ఇన్ని ఏడుపులు మంచివేనా బాబూ ?
X

తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేని విధంగా వేదనలు రోదనలు వినిపిస్తున్నాయి. రోజుకొక నాయకుడు మీడియా ముందుకు వచ్చి చిన్న పిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కొందరు అయితే ఆవేశాన్నీ ఆవేదనను కలగలిపి మంటను కళ్ళలోనే చూపిస్తున్నారు. ఉగాది రోజున అంటే శుభమాని కొత్త తెలుగు ఏడాది ప్రారంభం రోజున ఉండి టికెట్ తనకు దక్కదేమోనని భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు లిటరల్లీ కళ్ళ నీరు పెట్టారు.

సీన్ కట్ చేస్తే ఇపుడు మాడుగుల సీటు తనకు దక్కలేదని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మీడియా ముందు వగచి వగచి ఏడ్చారు చంద్రబాబు మీద మండిపడ్డారు. తనకు ఎందుకు ఇంతలా అన్యాయం చేస్తున్నారు అని వాపోయారు.

తన వ్యాపారాలు వ్యవహారం తన జీవితం తన ధనం అన్నీ టీడీపీ కోసం ఖర్చు పెట్టి అయిదేళ్ళు పార్టీ మోస్తే తనను పూర్తిగా పక్కన పెట్టారని ఆయన గుండెలు అవిసేలా ఏడ్చారు. ఇక తనకు ఎవరు దిక్కు అంటూ తల బాదుకున్నారు. చంద్రబాబుకు మాడుగుల సీటు గెలుచుకుని వస్తాను అని చెప్పినా కనికరించలేదని అన్నారు.

తనకు కాకుండా ఎన్నారైకి టికెట్ ఇచ్చారని తాను గోడు పెడుతూంటే ఇపుడు పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తిని తీసుకుని వస్తున్నారు అని అన్నారు. నేను ఏమి నేరం చేశాను ఏమి పాపం చేశాను అని గవిరెడ్డి పెట్టిన కన్నీరు చూసిన వారు టీడీపీకి అయినా చంద్రబాబుకు అయినా ఇది మంచి చేసే పరిణామమేనా అని అంటున్నారు.

నిజమే పార్టీ అన్నాక టికెట్ అందరికీ ఇవ్వలేరు. కానీ ఆశపెట్టి అయిదేళ్లూ పనిచేయించుకోవడం ఆనక తీసి అవతల పెట్టడం వల్లనే వారంతా అరచి గోల పెడుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి అన్నీ మామూలే అనుకుంటే పార్టీ నాయకులకే ఇచ్చిన హామీ అమలు చేయని బాబు ప్రజలకు ఏమి చేస్తారు అని ఉండి టీడీపీ కార్యకర్తలే తమ అధినేతను నిలదీస్తున్నారు.

అరకులో అయితే టికెట్ ఇచ్చి తీసుకున్నారు అని దొన్ను దొర మండిపోయారు తాను చచ్చిపోదామనే అనుకున్నాను అని కానీ తనను మోసం చేసిన వారికి తాను ఏంటో చూపించలనే పోటీకి ఇండిపెండెంట్ గా రెడీ అయ్యాను అంటున్నారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి అనే మాజీ ఎమ్మెల్యే ఇలాగే అంటోంది. చంద్రబాబు మీద చండ్ర నిప్పులే కురిపిస్తోంది.

ఈ కధలు అన్నీ ఉత్తరాంధ్రాలో చాలా చోట్ల ఉన్నాయి. అంతే కాదు ఏపీ అంతా ఉన్నాయి. మరి కూటమి గెలుస్తుంది అని ధీమాతో ఉన్న టీడీపీకి తమ్ముళ్ళ కంట నీరు అంత శుభమేనా అన్నది కూడా మరో వైపు పార్టీలోని వారికి డౌటానుమానంగా ఉందిట. దీనికి బాబే ఆలోచించుకుని తమ్ముళ్ళను దగ్గరకు తీసుకోవాలని అంటునారు. లేకపోతే మాత్రం ఈ కన్నీటి చిచ్చు కారుచిచ్చు అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు.