Begin typing your search above and press return to search.

'కందికుంట‌' కే చంద్ర‌బాబు ఓటు... సీటు ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికో...!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ టిక్కెట్ విష‌యంలో అధిష్టానం మ‌రోసారి క్లారిటీ ఇచ్చేసింది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 2:30 AM GMT
కందికుంట‌ కే చంద్ర‌బాబు ఓటు... సీటు ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికో...!
X

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ టిక్కెట్ విష‌యంలో అధిష్టానం మ‌రోసారి క్లారిటీ ఇచ్చేసింది. కొద్ది నెల‌ల క్రితం చంద్ర‌బాబు క‌దిరి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడే కందికుంట ఇక్క‌డ పోటీ చేస్తార‌ని క్లారిటీ ఇచ్చారు. తాజాగా మ‌రోసారి ఎన్నిక‌ల ముందు అంత‌ర్గ‌త స‌మీక్ష‌ల్లో కూడా క‌దిరి నుంచి కందికుంట‌కు గ్రీన్ టిక్ పెట్టేశారు. వాస్త‌వానికి ఈ టికెట్ కోసం.. మ‌రో ముగ్గురు లైన్లో ఉన్నారు. వీరిలో వైసీపీ నుం చి టీడీపీలోకి జంప్ చేసిన మైనారిటీ నాయ‌కుడు కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అయినా ఆది నుంచి పార్టీ కోసం.. ప‌నిచేస్తున్న కందికుంట వైపే పార్టీ అధినేత చంద్ర‌బాబు మొగ్గు చూపారు.

తాజాగా అనంత‌పురం, క‌డ‌ప జిల్లాల‌కు సంబంధించిన టికెట్ల కేటాయింపుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో ఉన్నత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌దిరి నియోజ‌క వ‌ర్గం విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. కందికుంట 2014లో స్వ‌ల్ప తేడాతో ఓడిపోవ‌డం, 2019 ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి ఓడిపోయినా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌తికిందంటే కందికుంట వ‌ల్ల మాత్ర‌మే అన్న విష‌యంలో చంద్ర‌బాబుకు పూర్తి క్లారిటీ ఉంది.

వైసీపీ మైనార్టీ నేత‌కు టిక్కెట్ ఇవ్వ‌డంతో టీడీపీ కూడా మైనార్టీ కోటాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన అత్త‌ర్ చాంద్ బాషా వైపు పార్టీ మొగ్గు చూపుతుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే చంద్ర‌బాబు మాత్రం కందికుంట‌కే టికెట్ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే రెండు, మూడుసార్లు తేల్చిచెప్పారు. ఒక‌వేళ ఆయ‌న‌పై ఉన్న కేసుల నేప‌థ్యంలో ఇబ్బందులు వ‌స్తాయ‌నుకుంటే కందికుంట ప్ర‌సాద్ స‌తీమ‌ణి య‌శోద‌కు అయినా.. టికెట్ ఇవ్వాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు.

అయితే.. తొలుత వెంక‌ట‌ప్ర‌సాద్ పై న‌మోదైన కేసుల‌ను ప‌రిశీలించేందుకు, న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు తొల‌గించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. దీంతో ఆయా కేసుల వివ‌రాల‌ను టీడీపీ లీగ‌ల్ సెల్ నాయ‌కుల‌కు పంపించి.. నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఏదేమైనా క‌దిరి టీడీపీ సీటు కందికుంట ఫ్యామిలీకే ఖాయ‌కానుంది.