Begin typing your search above and press return to search.

'మ‌న‌లాంటి ర‌బ్బ‌రు చెప్పులు వేసుకునే వాళ్లు'.. జ‌న‌సేన నేత కామెంట్స్‌

By:  Tupaki Desk   |   24 Feb 2024 5:00 PM GMT
మ‌న‌లాంటి ర‌బ్బ‌రు చెప్పులు వేసుకునే వాళ్లు.. జ‌న‌సేన నేత కామెంట్స్‌
X

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారం జ‌న‌సేన‌లో కాక రేపుతూనే ఉంది. 118 అసెంబ్లీ స్థానాల్లో జ‌న‌సేకు 24 సీట్లు మాత్ర‌మే కేటాయించ‌డం.. నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. దీంతో కీల‌క నేత‌లు ప్ర‌దాన నాయ‌కుల‌కు ట‌చ్‌లో లేకుండా పోయారు. ఇదే స‌మ‌యంలో టికెట్ ఆశించి భంగ‌ప‌డిన నాయ‌కులు కూడా.. తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నారు. కొంద‌రు మౌనంగా ఉంటే..మ‌రికొంద‌రు రోడ్డున ప‌డుతున్నారు. తాజాగా ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లాలోని జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌సేన నాయ‌కులు, పాఠం శెట్టి సూర్య చంద్ర తీవ్ర‌స్థాయిలో రోదించారు.

``మ‌న‌లాంటి ర‌బ్బ‌రు చెప్పులు వేసుకునే వాళ్లు టికెట్లు ఆశించ‌కూడ‌దు. టికెట్ ఆశించ‌డం మ‌న త‌ప్పు. డ‌బ్బులు లేనివాళ్లం మ‌నం. ఎమ్మెల్యే టికెట్ ఆశించ‌కూడ‌దు`` వ్యాఖ్యానిస్తూ.. భోరున విల‌పించారు. ఆయ‌న అనుచ‌రులు కూడా పెద్ద ఎత్తున విల‌పించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. పాఠంశెట్టికి గ‌తంలోనే ప‌వ‌న్ టికెట్ ఇస్తాన‌ని చెప్పిన మాట వాస్త‌వం. దీంతో జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఆయ‌న కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు. కాపుల‌ను కూడా ఐక్యం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు ఖాయ‌మ‌ని త‌మ నాయ‌కుడు చెప్పాడ‌ని ఆయ‌న ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ఇంత‌లోనే ఈ సీటును టీడీపీ తీసుకోవ‌డం, మాజీ మంత్రి జ్యోతుల వెంక‌ట అప్పారావు(నెహ్రూ)కు కేటాయించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో పాఠం శెట్టి డీలా ప‌డిపోయారు. బోరున విల‌పిస్తూ.. రోడ్డెక్కారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం ఆయ‌న నిరాహార దీక్ష‌కు దిగడం గ‌మ‌నార్హం. అచ్యుతాపురం దుర్గాదేవి గుడి ఎదుట దీక్షకు సిద్ధమైన సూర్యకు ఆయ‌న అనుచ‌రులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. ఆమరణ దీక్షతో ప్రాణాలు పోయినా లెక్కచేయనని సూర్య చంద్ర ప్ర‌క‌టించారు. మ‌రి దీనిపై జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆది నుంచి ఆశ‌లు క‌ల్పించి.. చివ‌రి నిముషంలో ఇలా చేయ‌డాన్ని పార్టీ వ‌ర్గాలు కూడా త‌ప్పుబ‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.