Begin typing your search above and press return to search.

ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఆ పార్టీనే? ఏనుగుకు ఎలుకకు పోలిక.. ఇదేం లెక్క?

టార్గెట్ 375 అంటూ బీజేపీ లోక్ సభ ఎన్నికలకు దూకుడుగా వెళ్తోంది. తమ కూటమి ఎన్డీఏ స్కోరు 400 దాటాలని చూస్తోంది.

By:  Tupaki Desk   |   5 April 2024 5:30 PM GMT
ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఆ పార్టీనే? ఏనుగుకు ఎలుకకు పోలిక.. ఇదేం లెక్క?
X

టార్గెట్ 375 అంటూ బీజేపీ లోక్ సభ ఎన్నికలకు దూకుడుగా వెళ్తోంది. తమ కూటమి ఎన్డీఏ స్కోరు 400 దాటాలని చూస్తోంది. ఈ క్రమంలో పాత మిత్రులను కౌగిలించుకుంటోంది. మరోవైపు కమలం పార్టీ సొంతంగా 450 స్థానాల్లో పోటీకి దిగుతోంది. ఇందులోంచే 375 గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఇక బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధిక స్థానాల్లో పోటీకి దిగుతున్న పార్టీ ఏదో తెలుసా?

ఎక్కడ 400? ఎక్కడ 17..?

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల్లో బీజేపీ తర్వాత టీడీపీనే అత్యధిక స్థానాల్లో బరిలో దిగుతుండడం గమనార్హం. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి బరిలో దిగుతున్న టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాస్తవానికి జనసేనతో కుదిరిన పొత్తులో తొలుత ఆ పార్టీకి 3 ఎంపీ సీట్లు ఇచ్చింది టీడీపీ. తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాక జన సేన ఒక సీటును తగ్గించుకుంది. రెండింటికి పరిమితమైంది. మరోవైపు టీడీపీ 17, బీజేపీ 6 సీట్లకు పోటీచేస్తున్నట్లైంది. కాగా, బీజేపీ అభ్యర్థులను నిలుపుతున్న 375 సీట్లలో ఏపీలో టీడీపీతో పొత్తులో పొందిన ఆరు సీట్లు కూడా ఉన్నాయన్నమాట. అయితే, ఎన్డీఏలో పెద్దన్న అయిన బీజేపీ తర్వాత అత్యధిక స్థానాల్లో పోటీకి దిగింది టీడీపీనే కావడం విచిత్రం.

జేడీయూ కంటే ఎక్కువ..

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. బిహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యు) కంటే ఎక్కువే స్థానాల్లో బరిలో దిగడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. బిహార్ లో జేడీయూ 16, మహారాష్ట్రలో ఏక్‌ నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 13, తమిళనాడులో పీఎంకే 10, పంజాబ్‌ లో శిరోమణి అకాలీదళ్‌ 9 సీట్లలో పోటీ చేయనున్నాయి. మిగతా భాగస్వామ్య పార్టీలు 5కు మించి స్థానాల్లో బరిలో దిగడం లేదు. బిహార్ లో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి 5, మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌ ఎన్‌సీపీ 5, తమిళ మానీల కాంగ్రెస్‌, ఎఎంఎంకె, ఆర్‌ఎల్‌డి, అప్నాదళ్ తలా 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఒక్కో స్థానానికి పోటీచేసే పార్టీలు ఎన్డీఏలో చాలానే ఉన్నాయి.