Begin typing your search above and press return to search.

చంద్రబాబు నిప్పు మాటల తుప్పు వదిలిన వేళ... ఐటీ నోటీసులు?

చంద్రబాబు నిత్యం వల్లించే నిజాయితీ కబుర్లు నేతిబీర చందమే అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చినట్లైంది!

By:  Tupaki Desk   |   1 Sep 2023 7:40 AM GMT
చంద్రబాబు నిప్పు మాటల తుప్పు వదిలిన వేళ... ఐటీ నోటీసులు?
X

రోజూ వ్రతాలు చేసే మహాతల్లి పోలీస్ రైడింగ్ లో దొరికినట్లు.. టాప్ ర్యాంకర్ కాస్తా మాస్ కాపీయిం‌గ్‌ కు పాల్పడి స్క్వాడ్‌ కు దొరికిపోయి డీబార్ అయినట్లు.. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టినవాడు డోపింగ్ టెస్టులో దొరికినట్లు.. ఇప్పుడు చంద్రబాబు నిత్యం వల్లించే నిజాయితీ కబుర్లు నేతిబీర చందమే అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చినట్లైంది!

అవును... చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారంటూ సాక్ష్యాత్తు దేశ ప్రధాని మోడీ బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... చంద్రబాబు రాత్రిపూట టార్చ్ లైటు పట్టుకుని ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం వేధించేవాడు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పినమాట గుర్తుండే ఉంటుంది.

అయితే తాజాగా ఈ విమర్శలకు బలం చేకూర్చే ఒక తాజా వార్త హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ తన కథనంలో కీలక విషయాలు వెల్లడించింది. అనంతరం ఆ పత్రిక తన అధికారిక ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేసింది!

చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో చేసింది ఒక్కటే.. తనకు నచ్చిన వాళ్లకు, అనుయాయులకు భారీగా రేట్లు పెంచి కాంట్రాక్టులు, పనులు ఇవ్వడం.. దానికి ప్రతిఫలంగా వారినుంచి వందలు, వేల కోట్లలో కమీషన్లు నొక్కడం అని ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. అయితే ఈ మేరకు ఏవైనా కేసులు నమోదైతే బాబు వాటిపై స్టేలు తెచ్చుకుంటారని అంటుంటారు.

ఆ సంగతి అలా ఉంటే... తాజా కథనం ప్రకారం అమరావతి కాంట్రాక్టర్‌ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్పిసిఎల్), ఎల్టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టాయని.. ఈ విషయాలు ఐటి సంస్థలు తమ సోదాల్లో గుర్తించాయని ఉంది! ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు డబ్బు ముట్ట జెప్పినట్లు షాపూర్జి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఐటి శాఖ గుర్తించిందని పేర్కొంది!

అసలు ఏమి జరిగింది? ఎలా జరిగింది?

తన కలల రాజధాని అంటూ చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణాల కాంట్రాక్టుల్లో ఆయన భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆ కథనం సారాంశం. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ని పిలిపించుకుని, తన పీఏ శ్రీనివాస్‌ ను కలవమని చెప్పారని.. దాంతో మనోజ్.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ను కలిశారని.. ఆ కథనం పేర్కొంది.

షాపూర్జీ పల్లోంజీ అనే కంపెనీ... కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసిందని చెబుతున్నారు!

దీంతో వాటిలో తన కమీషన్లు వసూలు చేసేందుకు గానూ చంద్రబాబు.. తన పీఏ శ్రీనివాస్ ను రంగంలోకి దింపారని.. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్ కు శ్రీనివాస్ అటాచ్ చేశారని ఆ కథనం పేర్కొంది. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారని.. అయితే ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారని.. అనంతరం వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మనోజ్ తో చెప్పారని ఆ కథనం వివరించింది.

దీంతో... బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించారని సమాచారం. ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడిందని.. ఈ విషయాన్ని మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఐటి అధికారుల ముందు కూడా అంగీకరించారని.. ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారని ఆ కథనం పేర్కొంది.

దీంతో ఈ విషయంలో చంద్రబాబుకు సైతం ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153సి కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను ఐటి శాఖ నోటీసుల్లో ప్రస్తావించిందని తెలుస్తుంది.

దీంతో... ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల అనంతరం చంద్రబాబు చేపట్టిన భేటీలు వెనుక ఈ కేసుకు సంబంధించిన కారణాలు కూడా ఉండిఉండొచ్చనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైపోయింది. ఏది ఏమైనప్పటికీ... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది చంద్రబాబుకు అతిపెద్ద బ్యాడ్ న్యూస్ లలో ఒకటిగా మారొచ్చని అంటున్నారు పరిశీలకులు.