Begin typing your search above and press return to search.

2019లో ఏపీలో టీడీపీలాగే.. 2024లో తెలంగాణలో బీఆర్ఎస్

ఈ విషయం మిగతా అన్ని రంగాల కంటే రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట జంపింగ్ లను చూస్తుంటే నిజం అనిపిస్తుంటుంది.

By:  Tupaki Desk   |   12 March 2024 5:30 PM GMT
2019లో ఏపీలో టీడీపీలాగే.. 2024లో తెలంగాణలో బీఆర్ఎస్
X

అధికారంలో ఉన్నప్పుడే అందరూ దగ్గరకు చేరతారు.. కుర్చీ దిగిపోయామంటే పరాయివారు అయిపోతారు.. ఈ విషయం మిగతా అన్ని రంగాల కంటే రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట జంపింగ్ లను చూస్తుంటే నిజం అనిపిస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులు ఇందుకు కచ్చితంగా పైన చెప్పుకొన్న మాట గుర్తుకు రాక మానదు.

అటు ఎంపీలు ఇటు

2019 ఎన్నికలకు ముందు ఏపీలో టీడీపీ చాలా పటిష్ఠంగా కనిపించింది. చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టడం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో విభేదించి దూకుడుగా వెళ్లడం తదితర కారణాలతో టీడీపీ మళ్లీ గెలుస్తుందా? అనే భావన కనిపించింది. కానీ, ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. చరిత్రలో ఎరుగని ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇదే సమయంలో కేంద్రంలో మోదీ సారథ్యంలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఆ వెంటనే టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లు బీజేపీలో చేరిపోయారు. రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి వంటి వారు కూడా బీజేపీలోకి వెళ్లిపోయారు. సుజనా, సీఎం రమేశ్ ఇద్దరూ చంద్రబాబుకు ఆంతరంగికులు అనేది అందరికీ తెలిసిందే. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి అయితే జగన్ ను విభేదించి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు వీరంతా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు అయినా ఆశ్చర్యం లేదు.

ఇటు ఎంపీలు అటు

తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి హ్యాట్రిక్ ఖాయం అంటూ ఎన్నికల్లో తలపడిన బీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోయింది. పాలనా వైఫల్యాలకు తోడు అహంకార వైఖరి కారణంగా పరాజయం మూటగట్టుకుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఓటమి బాధను మరింతగా రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. జహీరాబాద్ నుంచి రెండుసార్లు గెలిచిన బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి గెలిచిన పి.రాములు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వ్యాపారి అయిన బీబీ పాటిల్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చి రెండుసార్లు టికెట్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి.. ఆ తర్వాత రాజకీయంగా స్తబ్ధంగా ఉండిపోయిన రాములును ఎంపీ చేశారు. ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కూడా ఇదే తరహాలో బీఆర్ఎస్ కు షాకిచ్చారు. అయితే, ఆయన కాంగ్రెస్ లో చేరారు. మరో ఒకరిద్దరు ఎంపీలూ బీఆర్ఎస్ కు షాకిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వారి తదుపరి గమ్యం బీజేపీనే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం..?