Begin typing your search above and press return to search.

పొత్తు చర్చలు క్లైమ్యాక్సుకు చేరుకుంటున్నాయా?

అందుకనే సీట్ల సర్దుబాటు కూడా పై రెండు పార్టీల మధ్యే జరిగాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 11:14 AM GMT
పొత్తు చర్చలు క్లైమ్యాక్సుకు చేరుకుంటున్నాయా?
X

టీడీపీ కూటమిలో పొత్తు చర్చలు క్లైమ్యాక్సుకు చేరుకుంటున్నట్లుంది. ఇప్పటికైతే టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అందుకనే సీట్ల సర్దుబాటు కూడా పై రెండు పార్టీల మధ్యే జరిగాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే పొత్తు విషయమై చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి వచ్చారు కాబట్టే. దాని ఫాలోఅప్ గా హైదరాబాద్ శివార్లలో ఏపీ ఇన్చార్జి శివశంకర్ జీ ఏపీ బీజేపీలోని కోర్ కమిటీ సభ్యులతో మూడురోజుల పాటు చర్చలు జరిపారని సమాచారం.

దీనికి అదనంగా శని, ఆదివారాలు విజయవాడలోని పార్టీ ఆపీసులోనే పార్టీలోని ముఖ్యనేతలందరితోను చర్చించబోతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిపిన మూడురోజుల చర్చలు, విజయవాడలో జరపబోయే రెండురోజలు చర్చల సారంశాన్ని శివశంకర్ జీ ఢిల్లీకి తీసుకెళ్ళబోతున్నారు. అమిత్ షా తో చర్చల సారంశాన్ని వివరిస్తారని పార్టీవర్గాల సమాచారం. దీని ఆధారంగానే అమిత్ షా పొత్తుల విషయాన్ని ఫైనల్ చేయబోతున్నారట. బీజేపీలోని కొందరు నేతలేమో టీడీపీ, జనసేన కూటమితో కలవాలని గట్టిగా వాదిస్తున్నారు.

ఇదే సమయంలో మరికొందరు నేతలేమో పార్టీ ఒంటరిగానే పోటీచేయాలని పట్టుబడుతున్నారు. పార్టీ ఒంటరిగా పోటీచేస్తే తప్ప ఎదుగుదల సాధ్యంకాదని తమ వాదనను వినిపిస్తున్నారు. పార్టీ నేతల్లోని ఇలాంటి వాదనలను విన్నతర్వాత టీడీపీతో కలిసే విషయంలో ఏకాబిప్రాయంలేదని అర్ధమవుతోంది. మరి అభిప్రాయసేకరణ ఎంత తొందరగా జరుగుతుంది, ఎంత వేగంగా అబిప్రాయాలకు తన అభిప్రాయాన్ని జోడించి శివశంకర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారన్న విషయం సస్పెన్సుగా మారింది.

ఏదేమైనా ఈ ప్రక్రియమొత్తం ఓ పదిరోజుల్లోనే అయిపోతుందని పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంతలోపే జరిగిపోతే పొత్తులను వెంటనే తేల్చేసేందుకు అవకాశముందట. పొత్తులు తేలిపోతే అభ్యర్ధుల ఎంపిక, ప్రకటన వెంటవెంటనే అయిపోతాయి. అందుకనే అభిప్రాయాల సేకరణను వీలైనంత తొందరగా పూర్తిచేసేయాలని కమలనాదులు కోరుకుంటున్నారు. ఈ అంశాన్ని మరింతకాలం లాగటం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదన్న విషయాన్ని అగ్రనేతలు ఇప్పటికే గుర్తించారు. అందుకనే ఇన్చార్జి శివశంకర్ ను అర్జంటుగా పంపించినట్లు తెలుస్తోంది.