Begin typing your search above and press return to search.

అన్ని పార్టీలకు కీలకమైన జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఖరారు!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు కీలకమైన జిల్లా.. గుంటూరు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 6:09 AM GMT
అన్ని పార్టీలకు కీలకమైన జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఖరారు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు కీలకమైన జిల్లా.. గుంటూరు. ఎందుకంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు గుంటూరు జిల్లా ముఖ్యమైన ది.

కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారయ్యారని తెలుస్తోంది. మొత్తం 17 సీట్లకు గానూ 13 చోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులను ఫైనల్‌ చేశారని అంటున్నారు. వీటిలో అందరూ ముందు నుంచి ఊహించినట్టుగానే తెనాలి సీటును జనసేన పార్టీకి కేటాయించారు. తెనాలి నుంచి జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ పోటీ చేయనున్నారు. దీంతో ఇక్కడ సీటు ఆశిస్తున్న టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కు నిరాశ తప్పడం లేదు.

ఇక గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ పోటీ చేయనున్నారు. వేమూరు ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, పొన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ నుంచి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్, చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రత్తిపాడు నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి బూర్ల రామాంజనేయులు బరిలోకి దిగుతారని సమాచారం.

అలాగే వినుకొండ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఫ్యాక్షన్‌ నియోజకవర్గం మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, బాపట్ల నుంచి వేగేశ్న నరేంద్ర వర్మ,

సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రేపల్లె నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌ పోటీ చేయడం ఖాయమంటున్నారు.

అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటరీ స్థానాలకు గానూ రెండు స్థానాల అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. నరసరావుపేట నుంచి ప్రస్తుత వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే గుంటూరు ఎంపీగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ పోటీ చేస్తారని చెబుతున్నారు.

ప్రస్తుతం గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక బాపట్ల ఎంపీ స్థానంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. దీంతోపాటు గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. వీటిలో గుంటూరు పశ్చిమ సీటును కూడా జనసేన పార్టీకి కేటాయించవచ్చని పేర్కొంటున్నారు.