కూటమి వర్సెస్ వైసీపీ : పరాభవ పంచాంగం ఏమి చెప్పింది ?
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకలలో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు.
By: Satya P | 19 March 2026 3:35 PM ISTఏపీలో అధికార కూటమి విపక్ష వైసీపీల మధ్య రాజకీయ రచ్చ ఒక రేంజిలో సాగుతూనే ఉంటుంది. అది ఏ విషయం అయినా రెండు వైపులా పోటా పోటీగా ఉంటుంది. ఇదిలా ఉంటే కొత్త తెలుగు సంవత్సరాది వచ్చింది. దాని పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ ఉగాది వేళ అధికార కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉగాది కార్యక్రమాలను నిర్వహించింది. అదే సమయంలో వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉగాది కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రెండు చోట్లా పంచాంగ కర్తలు పఠనం చేశారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకు సాగుతుందని పండితులు చెప్పారు. వైసీపీకి అన్నీ మంచి రోజులే అని తాడేపల్లి పంచాంగం చెప్పుకొచ్చింది.
కూటమికి విజయం :
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకలలో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం సంకల్పించిన ప్రతీదీ ఫలిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు వారు ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం నెరవేరుతుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యంగా ప్రజాహితంతో ముందడుగులు వేస్తాయని వెల్లడించారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.అందుకే ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు.ప్రత్యేకంగా ఈ ఏడాది సాంస్కృతిక చైతన్యం కలుగుతుందని వివరించారు. అమరావతి విశ్వనగరంగా ఎదుగుతుందని రాష్ట్రానికి ప్రభుత్వానికి ఆర్ధిక ప్రగతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా సుఖ శాంతులతో ఉంటారని వివరించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు అంతా ఆనందం వ్యక్తం చేశారు.
వైసీపీ అనుకూల ఫలితాలు :
ఇక తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో పంచాంగ శ్రవణం చేసిన భాస్కర సుబ్రమణ్య సిద్ధాంతి వైసీపీకి పరాభవ నామ సంవత్సరంలో అన్నీ మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది పార్టీకి మంచి పునాది పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్న ప్రయత్నం చేసినా పెద్ద ఫలితాలే వస్తాయని జోస్యం చేప్పారు. పార్టీకి ఈ ఏడాది బలమైన పునాది పడుతుందని కూడా ఆయన వెల్లడించారు. దీంతో వైసీపీ నేతలలో జోష్ అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మొత్తానికి పోటా పోటీగా జరిగిన కూటమి వర్సెస్ వైసీపీ పంచాంగాలు రెండు చోట్లా ఆనందం కలిగించే విధంగా జోస్యాలు వెలువడడం విశేషం.
