వైసీపీ డబుల ప్లస్.. టీడీపీ డబుల్ మైనస్.. ఈ విషయం తెలుసా ..!
కనీసం ప్రజల మధ్యకు వెళ్ళకపోవడం వంటివి సీఎం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
By: Tupaki Desk | 13 July 2025 2:00 AM ISTసహజంగా ఏ పార్టీకైనా ఆ పార్టీ అధినేత చెప్పినట్టు నడవాలనేది ఒక నిబంధన. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ అధినేత చెప్పినట్టు వినాలి. పార్టీ అధినేత చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల విషయంలో అధినేతలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మాత్రం పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా వినిపిస్తోంది. అది ప్రభుత్వంలో ఉన్న టిడిపి, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అయినా.. ఈ రెండు పార్టీల్లోనూ పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి.
పార్టీ అధినేత ఒక ప్రకటన ఇస్తారు. క్షేత్రస్థాయిలో చేయాలని చెప్తారు. కానీ, దానికి భిన్నంగా జరుగుతున్నాయి. టిడిపి విషయానికి వస్తే అధినేత చెప్పే పనులు చేయడం లేదు. ఇక వైసిపి విషయానికి వస్తే జగన్ చెప్పిన దానికన్నా అతిగా చేసేస్తున్నారు. ఈ రెండు పరిణామాలు రెండు పార్టీలలోను భిన్నంగా కనిపిస్తున్నాయి. అతిగా చేయడం ఎంత ప్రమాదమో అసలు చేయకపోవడం కూడా అంతే ప్రమాదం. టిడిపి విషయానికి వస్తే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 50 రోజుల సమయాన్ని కేటాయించారు. కానీ ఇప్పటివరకు కనీసం వంద నియోజకవర్గాల్లో కూడా పార్టీ నాయకులు కార్యక్రమాన్ని చేపట్టలేదు.
కనీసం ప్రజల మధ్యకు వెళ్ళకపోవడం వంటివి సీఎం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తాను చెప్పినా కూడా వినడం లేదని, తాను ఆదేశించిన కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే ఏదైనా కార్యక్రమం నిర్వహించుకుని.. జన సమీకరణ చేయండి, కార్యకర్తలను తరలించండి అంటే ఆయన చెప్పిందానికన్నా అతిగా తీసుకురావడం, అతిగా వ్యవహరించడం వంటివి అపార్టీలోనూ చర్చనీయాంశంగా మారాయి. చేస్తే అతి, లేకపోతే లేదు అన్నట్టుగా క్షేత్ర స్థాయిలో నాయకులు వ్యవహరిస్తున్నారని వైసీపీఅధినేత జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా ఘటనలో ట్రాక్టర్లతో మామిడికాయలు తీసుకువచ్చే విషయం అసలు తన దృష్టిలో లేదని జగన్ చెబుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించిన సమావేశంలో వెల్లడైంది. నాకు చెప్పకుండానే మీరు ఎందుకలా చేశారని జగన్ ప్రశ్నించారు. అంతేకాదు అసలు అంతమందిని తరలించేటప్పుడు కనీసం నాకు ఒక మాట అయినా చెప్పి ఉండాలి కదా అని జగన్ సీనియర్ నాయకులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇలా.. అటు టీడీపీలో చెప్పిన దానిని నాయకులు పట్టించుకోకపో వడం.. వైసీపీలో చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా చేయడం వంటివి ఇరు పార్టీల్లోనూ చర్చగా మారింది.
