Begin typing your search above and press return to search.

ఎస్ గొడ్డలి పార్టీనే...వైసీపీ రివర్స్ మోడ్ !

వైసీపీని పేరు పెట్టి పిలవడం ఏనాడో టీడీపీ నేతలు మానుకున్నారు. అధినాయకత్వం నుంచి చిన్న స్థాయి నేతల దాకా అంతా గొడ్డలి పార్టీ అని పిలుస్తూ జనాల్లో దానినే ఒక బలమైన అభిప్రాయంగా మార్చడానికి వ్యూహాత్మకంగా చూస్తున్నారు.

By:  Satya P   |   9 Aug 2026 5:00 AM IST
ఎస్ గొడ్డలి పార్టీనే...వైసీపీ రివర్స్ మోడ్ !
X

వైసీపీని పేరు పెట్టి పిలవడం ఏనాడో టీడీపీ నేతలు మానుకున్నారు. అధినాయకత్వం నుంచి చిన్న స్థాయి నేతల దాకా అంతా గొడ్డలి పార్టీ అని పిలుస్తూ జనాల్లో దానినే ఒక బలమైన అభిప్రాయంగా మార్చడానికి వ్యూహాత్మకంగా చూస్తున్నారు. మామూలుగా చేసే విమర్శలలో ఎక్కడైనా ఇలా అంటారు. కానీ ఏకంగా పార్టీ పేరునే మార్చేసి ఈ విధంగా పాలిటిక్స్ చేయడం ద్వారా ఏపీలో టీడీపీ కొత్త రూట్ ని ఎంచుకుంది. అరాచకాల పార్టీ అని చెబుతూనే గొడ్డలి పార్టీ అని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా జనంలో వైసీపీ పట్ల ఒక రకమైన నెగిటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి టీడీపీ పక్కాగానే ప్లాన్ చేసింది. అయితే దానిని సమర్ధంగా తిప్పి కొట్టే వ్యూహాలు అయితే వైసీపీ వద్ద లేవని ఇప్పటికే తేలిపోయింది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు మాకు అర్ధం కావడం లేదని వైసీపీ నేతలు అమాయకంగా ప్రశ్నించడం ద్వారా డిఫెన్స్ మోడ్ లోనే ఉన్నామని చెబుతున్నారు.

వెన్ను పోటు పార్టీ అంటూ :

అయితే వైసీపీ కూడా టీడీపీని గొడ్డలి పార్టీ అని పేరు పెట్టింది కానీ దానిని టాప్ టూ బాటమ్ కంటిన్యూ చేయలేకపోయింది. అంతే కాదు టీడీపీ విమర్శలకు జవాబు చెప్పుకుంటూనే వైసీపీ పుణ్య కాలం అంతా సాగదీస్తోంది అన్న కామెంట్స్ సైతం ఉన్నాయి. అయితే వెన్నుపోటు పార్టీ అని టీడీపీని అన్నా ఆ ఇంపాక్ట్ ఏదీ పెద్దగా జనాల్లోకి పోవడం లేదని అంటున్నారు. పైగా గత ముప్పయ్యేళ్ళుగా ఇది వాడేసిన పదం కావడంతో కొత్త దనం ఏమీ లేదని గుర్తు చేస్తున్నారు. దాంతో వైసీపీ టీడీపీకి పేరు పెట్టి జనంలో నెగిటివ్ ఇమేజ్ తీసుకుని రావడానికి చేసిన అతి కొద్ది ప్రయత్నాలు కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదని అంటున్నారు.

ఒప్పుకోవడం ద్వారానే :

ఇక ఈ విషయంలో వైసీపీ చేసేది లేదని అనుకుందో లేదా ఇదే బాగుందని భావించిందో తెలియదు కానీ ఎస్ గొడ్డలి పార్టీనే అంటూ ఒప్పుకుంటోంది. అయితే అది టీడీపీ చెప్పినట్లు కాకుండా రివర్స్ మోడ్ లో ఎటాక్ చేసేలా వైసీపీ తనదైన స్ట్రాటజీని అమలు చేస్తోంది. అవును మాది గొడ్డలి పార్టీనే. అయితే అది మామూలు గొడ్డలి కాదు పరశురాముడి చేతిలో ఉన్న గొడ్డలి. ఆ గొడ్డలితోనే టీడీపీ కూటమిని ప్రజాస్వామ్య యుతంగా అధికారం నుంచి దించుతామని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ పరశురాముడి గొడ్డలి అన్న దానిని ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకుని వచ్చారు. ఇపుడు నేతలు అంతా అదే మాట అంటూ మా గొడ్డలి సామాన్యం అయినది కాదని బిగ్ సౌండ్ చేస్తున్నారు.

జనాలకు ఎక్కుతుందా :

టీడీపీ అంటున్న గొడ్డలి వేరు, అది బాబాయ్ వివేకా హత్య కేసులో గొడ్డలితో నరికేశారు అని ఆ పార్టీ గుర్తు చేస్తూ సింబాలిక్ గా వైసీపీకి ఆ పేరు పెట్టేసింది. అంతే కాదు వైసీపీతో అన్నీ అరాచకాలు దారుణాలు అన్నది జనాలకు తెలిసేలా సౌండ్ వచ్చేలా గొడ్డలి పార్టీ అని అంటోంది. జనాలకు ఇదే తీరున ప్రతీ రోజూ టీడీపీ టాప్ లీడర్స్ నుంచి అందరూ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇపుడు వైసీపీ అవును మాది గొడ్డలి పార్టీనే అని సొంతంగా క్లెయిం చేసుకుంటే అది పరశురాముడి గొడ్డలి అని అరాచకాలను నిర్మూలించేది అని ఎంతమంది అనుకుంటారు అన్నదే పెద్ద ప్రశ్న. అలా కాకుండా టీడీపీ చెప్పినట్లుగా అరాచకాలకు వైసీపీ నిలయం అన్నది నమ్మితే బూమరాంగ్ అవుతుంది కదా అన్నది కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి గొడ్డలి పార్టీ మాకు కలసి వస్తుందని వైసీపీ భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.