వైసీపీ ఓటు బ్యాంకుపై టీడీపీ కన్ను.. !
మహిళా ఓటు బ్యాంకు విషయంలో ఆది నుంచి కూడా వైసిపి చాలా ఆశలు పెట్టుకుంది. మహిళలంతా తమ వైపే ఉన్నారని, మహిళా ఓటు బ్యాంకు తమదేనని పదేపదే చెబుతూ వచ్చింది.
By: Garuda Media | 3 Oct 2025 5:00 AM ISTమహిళా ఓటు బ్యాంకు విషయంలో ఆది నుంచి కూడా వైసిపి చాలా ఆశలు పెట్టుకుంది. మహిళలంతా తమ వైపే ఉన్నారని, మహిళా ఓటు బ్యాంకు తమదేనని పదేపదే చెబుతూ వచ్చింది. గత ఎన్నికల సమయంలో 40% ఓటు బ్యాంకు వైసీపీ దక్కించుకుంది. పార్టీ అధికారంలోకి రాకపోయినా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే వైసిపికి దక్కినప్పటికీ ఓటు బ్యాంకు పరంగా చూసుకుంటే 40 శాతం పైగా వైసిపి దక్కించుకుంది. దీనిలో దాదాపు 26% మహిళలే ఓటు వేశారన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. దీంతో మహిళలు తమ వైపు ఉన్నారని, మహిళా పార్టీగా తాము వారికి చేరువయ్యామని జగన్ ఇటీవల కాలంలో కూడా చెబుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు పరిస్థితిలు మారిపోతున్నాయి. మహిళా ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మహిళలను సెంట్రిక్ గా చేసుకుని అమలు చేస్తున్న పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాలు కూడా ఆయన తీసుకువచ్చారు. దీనిలో భాగంగా సూపర్ సిక్స్ లో ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేస్తున్నారు. దీంతోపాటు దసరా కానుకగా మరో రెండు కీలక మహిళా పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వీటిని త్వరలోనే ఆయన ప్రకటించనున్నారు.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని లాంఛనాలను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా ఇంట్లో ఉన్న బాలికలకు ఉన్నత స్థాయి వరకు చదువుకునేలాగా బ్యాంకుల నుంచి స్వల్ప వడ్డీకి లక్ష రూపాయలు చొప్పున రుణాలను ఇప్పించమన్నారు. వీటిని ఈఎంఐ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి ద్వారా వివాహాలు చేసుకునే యువతులకు మాత్రమే లక్ష రూపాయల చొప్పున రుణాలను అందించనున్నారు.
ఈ రెండు పథకాలు కూడా పేదలకు, అదే విధంగా మహిళలకు ఎంతో కీలకంగా మారుతాయి. మహిళా ఓటు బ్యాంకు ను చెక్కుచెదరకుండా తమకే అనుకూలంగా ఉంచుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి మహిళలు కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తే వైసిపి పెట్టుకున్న ఆశలు నిజంగానే కనుమరుగవుతాయి... అన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఏది ఏమైనప్పటికీ మహిళా సెంట్రిగ్గా జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏ పార్టీకి లాభాని చేకూరుస్తాయి.. ఏ పార్టీ నష్టపోతుందని.. అనేది వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాలి.
