Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ : పులివెందులలో టీడీపీకి భారీ మెజార్టీ

ఎన్నిక ఫలితం చూస్తే అధికార టీడీపీ ఏకపక్షంగా విజయం దక్కించుకున్నట్లు వెల్లడైంది. ఇక ఎన్నికల కౌంటింగును వైసీపీ బహిష్కరించింది.

By:  Tupaki Desk   |   14 Aug 2025 11:45 AM IST
బిగ్ బ్రేకింగ్ : పులివెందులలో టీడీపీకి భారీ మెజార్టీ
X

వాడివేడిగా జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయారు. ఈ నెల 12న ఎన్నిక జరగగా, ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించగా, ఒకే రౌండ్లో ఎన్నిక ఫలితం తేలిపోయింది. మొత్తం 7814 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొత్తం 11 మంది పోటీ చేయగా, వైసీపీ అభ్యర్థితో సహా ఏ ఒక్కరికీ డిపాజిట్ దక్కలేదు. ఎన్నిక ఫలితం చూస్తే అధికార టీడీపీ ఏకపక్షంగా విజయం దక్కించుకున్నట్లు వెల్లడైంది. ఇక ఎన్నికల కౌంటింగును వైసీపీ బహిష్కరించింది. వారం రోజులుగా ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడిన వైసీపీ, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కౌంటింగును బహిష్కరించింది. కౌంటింగు కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థి, కౌంటింగు ఏజెంట్లు ఎవరూ రాలేదు. వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు రాలేదు.

ఇక భారీ విజయం సాధించడంతో టీడీపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ అడ్డాలో గెలిచామని, పులివెందుల వైసీపీ అడ్డా కాదని నిరూపించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. మరోవైపు మంత్రులు సవిత, రామప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవితోపాటు పలువురు టీడీపీ నేతలు కడప కలెక్టరేట్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.