ఒంటిమిట్టలోనూ టీడీపీ ఘన విజయం
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు అధికార, విపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. రెండు పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో శక్తికి మించిన స్థాయిలో పోరాడాయి.
By: Tupaki Desk | 14 Aug 2025 3:33 PM ISTఉమ్మడి కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ఘన విజయం సాధించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, ఒంటిమిట్ట జడ్పీటీసీగా ముద్దు కృష్ణారెడ్డి (టీడీపీ) గెలుపొందారు. ఈ నెల 12న ఉప ఎన్నికలు నిర్వహించగా, గురువారం కౌటింగ్ జరిగింది. పులివెందులలో వైసీపీకి కనీసం డిపాజిట్ దక్కలేదు. ఇక ఒంటిమిట్టలో వైసీపీ చెప్పుకోదగ్గరీతిలో పోటీపడింది. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి దాదాపు 6,270 ఓట్లురాగా, వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 3,165 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి సుమారు 3,105 ఓట్లతో గెలుపొందారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు అధికార, విపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. రెండు పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో శక్తికి మించిన స్థాయిలో పోరాడాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాగా కావడంతో ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో టీడీపీ పోటికి దిగింది. అనుకున్నట్లే విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరగడంతోనే టీడీపీ విజయం సాధించిందని వైసీపీ విమర్శిస్తోంది. రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గంతోపాటు ఆయన సొంత జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవడంతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 14 నెలల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఓట్ల లెక్కింపును వైసీపీ బహిష్కరించింది. పోలింగ్ ను సక్రమంగా నిర్వహించలేదన్న కారణంతో కోర్టుకు వెళ్లిన వైసీసీ ఓట్ల లెక్కింపునకు హాజరైతే, పోలింగును అంగీకరించినట్లేనన్న భావనతో లెక్కింపునకు గైర్హాజరైంది. అభ్యర్థులు, ఏజెంట్లు, కనీసం కార్యకర్తలు కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద కనిపించలేదు.
