ఐటీ అభివృద్ధిపై వైసీపీకి ఎందుకంత అక్కసు? రాష్ట్రం పురోగమిస్తుంటే భరించలేకపోతున్నారా!?
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం పురోగమిస్తుండటంపై వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
By: Tupaki Desk | 21 April 2025 4:45 PM ISTఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం పురోగమిస్తుండటంపై వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. జిల్లాకో పార్టీ కార్యాలయం నిర్మించుకున్న వైసీపీ నేతలకు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఐటీ రంగాన్ని దెబ్బతీసి, పరిశ్రమలను తరిమికొట్టిన విధానాలనే వైసీపీ నేతలు ఇంకా అనుసరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం పూర్తిగా దెబ్బతిందని, అవినీతి, వేధింపుల కారణంగా పారిశ్రామికవేత్తలు భయాందోళనలకు గురయ్యారని, అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని గతంలో ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శించాయి. కొత్త పెట్టుబడులు ఆగిపోయాయని, ఉద్యోగ కల్పన కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై, ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు, ఐటీ సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తోంది. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, భూ కేటాయింపులను వేగవంతం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల వైఖరి విమర్శలకు దారితీస్తోంది. తాము ఐదేళ్లలో సాధించలేని సంస్థలను, పెట్టుబడులను కేవలం పది నెలల స్వల్ప వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం తీసుకురావడం చూసి వారు ఓర్వలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వారికి కడుపు మండిపోతోందని, అందుకే ఐటీ, పరిశ్రమలకు భూముల కేటాయింపులపై నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో పలచన అవుతున్నారని మండిపడుతున్నారు.
విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడంలో భాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలకు, అలాగే కాపులఉప్పాడలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెం.3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి రూ. 1 కోటి చొప్పున 3.5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి, తద్వారా ఉద్యోగాల కల్పనకు రెండేళ్ల గడువు కూడా విధించింది. రాష్ట్ర యువత భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ భూ కేటాయింపులపై కూడా వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని, దీని వెనుక వారి ఈర్ష్య, ద్వేషం తప్ప వేరే కారణం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసలు పెట్టుబడులు వద్దు? కంపెనీలు వద్దు? ఉద్యోగాలు వద్దు?! రాష్ట్రం అసలు బాగుపడొద్దు?! ఇదేనా వైసీపీ నేతలు కోరుకునేది!? అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో కేవలం 11 సీట్లకే పరిమితమై, ప్రజల మద్దతు కోల్పోయినప్పటికీ తమ వైఖరిని మార్చుకోకుండా, సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్నారని, వారి తీరు రాష్ట్ర భవిష్యత్తుకు ఏ మాత్రం దోహదపడేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకో పార్టీ ప్యాలెస్‌లు నిర్మించుకున్నవారికి, పరిశ్రమలకు భూములు కేటాయించడంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
