Begin typing your search above and press return to search.

నో వర్క్.. నో పే.. పాలిటిక్స్ లో కుదురుతుందా? అయ్యన్నా...

అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేస్తామని ఒక వైపు బెదిరిస్తూనే.. సభకు రాని వారు జీతభత్యాలు తీసుకోవడంపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Sept 2025 7:00 PM IST
నో వర్క్.. నో పే.. పాలిటిక్స్ లో కుదురుతుందా? అయ్యన్నా...
X

ఏపీ రాజకీయాల్లో అధికార టీడీపీ నేతలు ప్రతిపక్షం వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేస్తామని ఒక వైపు బెదిరిస్తూనే.. సభకు రాని వారు జీతభత్యాలు తీసుకోవడంపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వ్యవహరించాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి హోదాల్లో ఉన్నవారే ఈ చర్చకు శ్రీకారం చుట్టడం ఆంధ్రా రాజకీయాలను వేడిక్కిస్తోందనేందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, బుధవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు చెల్లించడంపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దీంతో ఈ సారి శాసనసభ సమావేశాలకు ముందే రచ్చ మొదలైన పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.

ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రామంటూ వైసీపీ మొండి పట్టుదల ప్రదర్శించడంపై అధికార టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎలాగైనా సరే వైసీపీ నేతలను రెచ్చగొట్టి అసెంబ్లీకి రప్పించే వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులోభాగంగానే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్న లేవనెత్తుతున్నారని అంటున్నారు. ఇన్నాళ్లు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేస్తామని, కనీసం 60 రోజుల్లో ఒకసారైనా అసెంబ్లీకి రావాల్సిందేనంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు చెప్పేవారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతోసహా రాష్ట్రంలో 11 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయంటూ ప్రకటనలు చేశారు.

వైసీపీ ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికార పక్షం వ్యూహం మార్చినట్లు భావిస్తున్నారు. సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యేల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే సరికొత్త ఎత్తుగడ వేసినట్లు సందేహిస్తున్నారు. అందుకే సభ ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అంతేకాకుండా ఎవరైనా పని చేయకుండా జీతాలు తీసుకుంటామంటే మీరు అంగీకరిస్తారా? అని ప్రజలను అడగడం కూడా వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచడానికేనని వ్యాఖ్యానిస్తున్నారు.

మంగళవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాను స్పీకర్ గా ఉంటూ ఇలా మాట్లాడటం తప్పో కాదో తనకు తెలియదని అంటూనే వైసీపీ నేతల జీతాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకపోతే చర్యలు తీసుకుంటారు కదా, అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా, అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా?’’ అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. ఆయన మాటలను బట్టి చూస్తే వైసీపీపై అనర్హత వేటు వేస్తామని ఇన్నాళ్లు చేసిన హెచ్చరికలను కాస్త పక్కన పెట్టి ముందు వారి జీతాలు నిలిపేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడనప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరిచ్చారంటూ స్పీకర్ ప్రశ్నించడం చర్చనీయాంశం అవుతోంది. ప్రజల్లో ఆలోచన రేకెత్తించి తాము ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదని, వారిపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు ఉందని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నేతలకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం ఆపగలదా? అటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 60 రోజుల్లో ఒకసారైనా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని ఇన్నాళ్లు అధికారపక్షం చేసిన హెచ్చరికలను వైసీపీ తిప్పికొట్టింది. గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి రాకపోతే అప్పటి ప్రభుత్వం అనర్హత వేటు వేసిందా? అంటూ నిలదీసింది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ లేవనెత్తన ప్రశ్నకు వైసీపీ ఏం సమాధానం చెబుతుందనేది ఉత్కంఠగా మారింది.