Begin typing your search above and press return to search.

40 ఏళ్లలో టీడీపీకి ఒక్కసారే చాన్స్...

రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ రాజకీయం ఆసక్తి రేపుతోంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నెగ్గడంతో త్వరలో టీడీపీ నేత మేయర్ కానున్నారు.

By:  Tupaki Desk   |   20 April 2025 10:39 PM IST
TDP Set to Break 40-Year Jinx in Visakhapatnam Mayor Seat
X

రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ రాజకీయం ఆసక్తి రేపుతోంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నెగ్గడంతో త్వరలో టీడీపీ నేత మేయర్ కానున్నారు. నాలుగు దశాబ్దాల విశాఖ కార్పొరేషన్ లో టీడీపీకి ఎప్పుడూ నిరాశే ఎదురవుతోంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత గ్రేటర్ మేయర్ గా సీనియర్ నేత పీలా శ్రీనివాసరావు ఎన్నికకానున్నారని అంటున్నారు. టీడీపీకి పెట్టని కోటగా చెప్పే విశాఖలో మేయర్ పీఠం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మారడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

బ్రిటిష్ పాలన కాలంలోనే మున్సిపాలిటీగా ఆవిర్భవించిన విశాఖ.. 1979లో కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. కానీ, కార్పొరేషన్ కు తొలి ఎన్నిక 1981లో జరిగింది. అప్పటికి టీడీపీ ఆవిర్భవించలేదు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ నేత ఎన్ఎస్ఎన్ రెడ్డి తొలి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఆవిర్భావించిన నాలుగేళ్ల తర్వాత కార్పొరేషన్ కు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ నేత డీవీ సుబ్బారావు మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇప్పటివరకు విశాఖ పీఠం టీడీపీకి అందని ద్రాక్షగానే ఊరిస్తూ వస్తోంది.

విశాఖ నగరంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను 2019లో గెలిచిన టీడీపీ.. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయింది. ఇక అంతకుముందు కూడా మూడు సార్లు కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఆ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 1995, 2000 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా, విశాఖ పీఠం మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం మేయర్ గా పదవీబాధ్యతలు స్వీకరించడానికి టీడీపీ ఉవ్విళ్లూరుతోంది.

విశాఖ నగరంపై టీడీపీది ప్రత్యేక ముద్ర. రాష్ట్రంలో ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్థులు గెలిచినా, విశాఖ వాసులు మాత్రం పసుపు జెండాను వదల్లేదు. దీనికి 2019 ఎన్నికలే నిదర్శనం. ఆ ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకుని విశాఖ నగరంలో నాలుగు సీట్లు దక్కించుకోవడం ఓ రికార్డు. అయితే నగరంలో ఎంత పట్టున్నా, కార్పొరేషనులో ఇన్నాళ్లు పైచేయి సాధించలేకపోయిన టీడీపీకి.. ఇప్పుడు ఆ వెలితి తీరే అవకాశం ఏర్పడింది. మరో ఏడాది జరిగే స్థానిక ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో కానీ, ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ నుంచి వచ్చిన నేతలతో కార్పొరేషన్ లో పూర్తి ఆధిక్యత కనబరుస్తోంది. దీంతో కూటమి పెద్దలు ఎవరిని డిసైడ్ చేస్తే వారే మేయర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విజయం ద్వారా నాలుగు దశాబ్దాల గెలుపు దాహం తీర్చుకోబోతున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.