Begin typing your search above and press return to search.

జగన్ కోర్టు టూరుపై టీడీపీ సోషల్ మీడియా సెటైర్లు.. ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో అంటూ పోస్టులు

మాజీ ముఖ్యమంత్రి జగన్ కోర్టు వాయిదాకు వెళ్లడంపై టీడీపీ సోషల్ మీడియా సెటైర్లు సంధిస్తోంది. కోర్టు వాయిదా కోసం ప్రత్యేక విమానంలో వెళ్లిన జగన్.. ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించి కొత్త రికార్డు క్రియేట్ చేశారంటూ ట్రోల్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   21 Nov 2025 12:00 AM IST
జగన్ కోర్టు టూరుపై టీడీపీ సోషల్ మీడియా సెటైర్లు.. ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో అంటూ పోస్టులు
X

మాజీ ముఖ్యమంత్రి జగన్ కోర్టు వాయిదాకు వెళ్లడంపై టీడీపీ సోషల్ మీడియా సెటైర్లు సంధిస్తోంది. కోర్టు వాయిదా కోసం ప్రత్యేక విమానంలో వెళ్లిన జగన్.. ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించి కొత్త రికార్డు క్రియేట్ చేశారంటూ ట్రోల్ చేస్తోంది. ఏపీలో బ్రేక్ ఫాస్ట్.. తెలంగాణలో లంచ్.. కర్ణాటకలో డిన్నర్.. ఎంతైనా పెట్టిపుట్టాలి సామీ అంటూ మాజీ సీఎంపై పోస్టులు, స్పెషల్ వీడియోలు వదులుతోంది టీడీపీ. ఇక జగన్ టూరులో ఆయన అభిమానులు ‘రప్పా.. రప్పా..’ నినాదాలను చేయడంపైనా టీడీపీ సీరియస్ కామెంట్లు చేస్తోంది.

అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న మాజీ సీఎం జగన్మోహనరెడ్డి గురువారం హైదరాబాద్ లోని నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టులో వాయిదాకు హాజరైన విషయం తెలిసిందే. గతంలో లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో జగన్ కోర్టు అనుమతి కోరగా, తదుపరి వాయిదాకు వస్తానంటేనే లండన్ పర్యటనకు అనుమతిస్తామని అప్పట్లో న్యాయాధికారి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ గురువారం వాయిదాకు హాజరుకావాల్సివచ్చింది. ఇందుకోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు ప్రత్యేక విమానం బుక్ చేసుకున్నారు.

కోర్టుకు వస్తున్న జగన్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకోడాన్ని టీడీపీ తప్పుపడుతూ విమర్శలు గుప్పించింది. కోర్టుకు వస్తున్న జగన్ గంటకు రూ.8 లక్షల రూపాయలు అద్దెకు విమానాన్ని మాట్లాడుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జగన్ తన పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో తాను కోర్టులో గంట పాటు ఉండనున్నట్లు స్పష్టం చేశారు. దీనిపైనా టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ పోస్టులు, వీడియోలతో హోరెత్తించారు. అక్రమాస్తుల కేసులో నిందితుడు న్యాయమూర్తికి టైం ఇవ్వమేంటంటూ ప్రశ్నిస్తూ మాజీ సీఎంపై ట్రోలింగుకు దిగారు.

ఇక గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ కు హైదరాబాదులో ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో గుమిగూడిన జగన్ అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు దారిపొడవునా జగన్ కాన్వాయ్ ను అనుసరిస్తూ హైదరాబాద్ రోడ్లపై హడావుడి చేశారు. కొందరు అత్యుత్సాహంతో ‘2029లో రప్పా.. రప్పా..’నే అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. దీనిపై పలు రకాల విమర్శలు వ్యక్తమయ్యాయి.