Begin typing your search above and press return to search.

కాఫీ కబుర్లు...టీడీపీలో కొత్త కాన్సెప్ట్

తెలుగుదేశం పార్టీలో మూడో తరం అధినాయకుడుగా నారా లోకేష్ అవతరించారు. దాంతో పార్టీలో సమూలమైన మార్పులను ఆయన తీసుకుని వస్తున్నారు.

By:  Satya P   |   2 Dec 2025 12:16 PM IST
కాఫీ కబుర్లు...టీడీపీలో కొత్త కాన్సెప్ట్
X

తెలుగుదేశం పార్టీలో మూడో తరం అధినాయకుడుగా నారా లోకేష్ అవతరించారు. దాంతో పార్టీలో సమూలమైన మార్పులను ఆయన తీసుకుని వస్తున్నారు. కార్యకర్తలకు ప్రమాద భీమాను అమలు పరచడమే కాకుండా కోటికి సభ్యత్వాలను పెంచడంతో పాటు పార్టీకి క్యాడర్ కి మధ్య అంతరం పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తే పార్టీకి అధినాయకత్వం అన్నది మాటలలో కాకుండా చేతలలో చూపిస్తున్నారు. అంతే కాదు ఎన్నో వినూత్న ఆలోచనలు పార్టీ పరంగా అమలు చేస్తూ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో టీడీపీని నారా లోకేష్ తీర్చిదిద్దుతున్నారు అని చెప్పాలి.

కొత్త కొత్తగా :

ఎపుడూ పాత విధానం అనుసరిస్తే అది రొటీన్ అవుతుంది. అంతే కాదు మారుతున్న కాలానికి తగినట్లుగా పార్టీ కూడా మారాలి. అందుకే నారా లోకేష్ పార్టీ శిక్షణా తరగతులను కూడా కొత్త కాన్సెప్ట్ తో నిర్వహించారు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్లు పేరుతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. నారా లోకేష్ మాటలతో పాటు ఆయన ఆలోచనలను కూడా మండల నాయకులు అంతా ఎంతో శ్రద్ధగా విన్నారు.

ఎదగాలి అంతా :

ఇదే లోకేష్ చెబుతున్నది. ఒక బ్రహ్మాండమైన పార్టీ ఉంది. అందులో ఎక్కడో ఒక చోట చేరిన వారు అక్కడితో ఆగిపోరాదు అని నారా లోకేష్ పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు. గ్రామ మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనేది పార్టీ సిద్ధాంతం, అదే అధినాయకత్వం విధానం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వారికి దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం పని చేయడమే కాదు, ప్రజల మనసులను కూడా గెలుచుకునే విధంగా అంతా కష్టపడి పనిచేయాలని లోకేష్ పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవడంతో పాటు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీ వర్శిటీగా :

రాజకీయ విశ్వవిద్యాలయం ఏదైనా ఉంది అంటే అది ఒక్క టీడీపీ మాత్రమే అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇందులో చేరి ఎందరో ఎన్నో రకాలుగా ఎదిగారు అని ఆయన గుర్తు చేశారు. 2012లో మంత్రి నిమ్మల రామానాయుడు టీడీపీకి మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేశారని లోకేష్ చెప్పారు. ఆయనే కాదు, గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు అనేకమంది రాష్ట్రస్థాయి నేతలుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేయాలనేది పార్టీ సిద్ధాంతం అని వారికి చెబుతూ ఉత్సాహపరిచారు.

పార్టీతోనే అంతా :

ఏ నాయకుడు అయినా ఎంత పెద్ద వారు అయినా పార్టీ ఉంటేనే గుర్తింపు గౌరవం అని లోకేష్ చెప్పారు. పార్టీ పరంగానే ఎవరైనా ఎదిగి పెద్ద నాయకులు అవుతారు అని ఆయన అన్నారు. పార్టీ లేకపోతే ఎవరూ లేనేలేరని లోకేష్ చెప్పారు. పార్టీలో కష్టించి పనిచేస్తే అందరికీ అవకాశాలు దక్కుతాయి అనడానికి టీడీపీని మించిన ఉదాహరణ వేరేది లేదని అన్నారు. పార్టీ అనే ఈ విషయాన్ని ఎవరూ ఎపుడూ విస్మరించకూడదని లోకష్ చెబుతూ ఎంతటి వారికైనా పార్టీ అనేది సుప్రీం అని లోకేష్ స్పష్టం చేశారు.

కొత్త తరం వైపు :

నారా లోకేష్ పార్టీని పటిష్టం చేయడమే కాదు, కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. అందుకే ఆయన మండల నాయకుల శిక్షణా సమావేశాలలో కీలక వ్యాఖ్యలు చేశారు అని భావిస్తున్నారు. పార్టీ పుట్టి ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాలు అయింది. మరో నాలుగున్నర దశాబ్దాలు ఇదే వేగంతో ముందుకు సాగాలి అంటే కనుక కచ్చితంగా కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. మండల నాయకుల నుంచే కొత్త తరం పుడుతుందని విశ్వసిస్తున్న ఆయన ఆ దిశగా నాయకులకు హితబోధ చేశారు అని అంటున్నారు. మరి లోకేష్ మాటలను అంది పుచ్చుకుని ఎంతమంది నాయకులు రాష్ట్ర స్థాయిలో వెలుగుతారో చూడాల్సి ఉంది.