Begin typing your search above and press return to search.

'తిరువూరు'లో తప్పు అంతా అతడిదే.. చంద్రబాబు చేతికి నివేదిక?

ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వైఖరిపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

By:  Tupaki Political Desk   |   9 Nov 2025 1:36 PM IST
తిరువూరులో తప్పు అంతా అతడిదే.. చంద్రబాబు చేతికి నివేదిక?
X

తెలుగుదేశం పార్టీలో తుఫాన్ రేపిన తిరువూరు పంచాయితీపై అధినేత చంద్రబాబుకు నివేదిక అందింది. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని క్రమశిక్షణ సంఘం సభ్యులు తిరువూరు నివేదిక సమర్పించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పత్రికలకు ఎక్కిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ నిబంధనలను అతిక్రమించారని క్రమశిక్షణ సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తూ అధినేత చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.

అందరూ ఊహించినట్లే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిదే తప్పని క్రమశిక్షణ సంఘం తేల్చేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన రెండో రోజు నుంచే కొలికపూడి వివాదాస్పదంగా వ్యవహరించడాన్ని క్రమశిక్షణ సంఘం ప్రస్తావించింది. ఇక ఆయన అన్ని హద్దులూ దాటేస్తున్నట్లు అభిప్రాయపడింది. ఎమ్మెల్యే విషయంలో అధినేత చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించింది. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారమూ సమర్పించలేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే అధికారాలకు కత్తెర వేయడం లేదా సస్పెన్షన్ విధించాలని సిఫార్సు చేసింది. అయితే తుది నిర్ణయాన్ని అధినేత చంద్రబాబుకే వదిలేసింది.

ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వైఖరిపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో అమరావతి రైతుల తరఫున పోరాడిన కొలికపూడి రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఉద్యమం, రాజకీయం వేర్వేరుగా ఉంటుందని, ఈ విషయం తెలుసుకోలేక కొలికపూడి దూకుడుగా వ్యవహరిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇటీవల ఆయన వైసీపీ ట్రాప్ లో పడ్డారని మరికొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీకి తలనొప్పులు తెస్తున్న కొలికపూడిపై నియోజకవర్గ కేడర్ లో కూడా సానుకూల అభిప్రాయం లేదని ఫిర్యాదులను పార్టీ సీరియస్ గా పరిగణించింది. అందుకే ఆయన విషయంలో మరో చాన్స్ ఇవ్వకూడదన్నట్లే అధినేతకు సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కొలికపూడి భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పడంతో ఆయనకు ఫైనల్ గా మరోసారి చాన్స్ ఇస్తారా? లేక అధికారాలకు కత్తెర వేసి పార్టీ నుంచి స్వచ్ఛందంగా బయటకు వెళ్లేలా పొగబెడతారా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.