'వారసుల'కు ఊరికే ఇచ్చేస్తారా... ఇదిగో స్ట్రాటజీ.. !
అయితే.. వారు కోరుకోగానే.. టికెట్లు ఇచ్చేస్తారా ? అంటే కాదన్న చర్చే తెరమీదకి వచ్చింది. మూడు కీలక విషయాలపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
By: Garuda Media | 10 Dec 2025 8:15 AM ISTవచ్చే ఎన్నికల్లో వారసులను రంగంలోకి దించేందుకు.. ఇప్పటి నుంచే టీడీపీలో నాయకులు ప్రయత్నా లు చేస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే కొందరు నాయకులు ఈ ప్రయత్నాలు చేశారు. కానీ, విఫలమ య్యారు. పోటీ తీవ్రత నేపథ్యంలో చంద్రబాబు చాలా దూరం ఆలోచించి.. వారసుల్లో తప్పదని అనుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఉదాహరణకు నర్సీపట్నం, సర్వేపల్లి, రాప్తాడు వంటివి కళ్లముందు కనిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వారసులకు టికెట్లు ఇవ్వలేదు.
ఇక, ఇప్పుడు మూడేళ్ల ముందుగానే నాయకులు తమ వారసుల పాట పాడుతున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బహిరంగ ప్రకటనే చేసేశారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడు రాఘవ రెడ్డి పోటీ చేస్తారని.. తాను రిటైర్మెంట్ తీసుకుంటానని కూడా చెప్పారు. ఈయన ఒక్కరే కాదు.. స్పీకర్ కుమారుడు చింతకాయల విజయ్ నుంచి పలువురు యువ నాయకులు బరిలో ఉన్నట్టుగా పార్టీకి సమాచారం అందింది. దీనిపై తాజాగా జాబితాను కూడా రెడీ చేసుకున్నారు.
అయితే.. వారు కోరుకోగానే.. టికెట్లు ఇచ్చేస్తారా ? అంటే కాదన్న చర్చే తెరమీదకి వచ్చింది. మూడు కీలక విషయాలపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
1) వారసులకు డబ్బు మాత్రమే రాజకీయం కాదు. ప్రజల్లో వారికి ఉన్న ఇమేజ్‌ను కూడా అంచనా వేస్తారు. అంటే.. ఇప్పటి నుంచే వారసులు ప్రజల మధ్య ఉండాలి. ప్రజల అభిమానం చూరగొనాలి.
2) ఎన్నికల ఓటు బ్యాంకును సొంతం చేసుకునే స్థాయిలో ఉండాలి. అంటే.. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా తట్టుకునే స్థాయికి ఎదగాలి.
3) ఈ రెండు ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసుకుంటారు. సమీకరణలు, రాజకీయాలు ప్రత్యర్థుల వ్యూహ ప్రతివ్యూహాలు.. ఇలా ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని అప్పుడు వారసులను నిర్ణయిస్తారు. ఎందుకంటే.. ఒకప్పటి మాదిరిగా రాష్ట్రంలో రాజకీయాలు లేవు. ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో రాజకీయాలు మారుతున్నాయి. సో.. వీటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు అడుగులు వేస్తారు. ఆశ ఉండొచ్చు.. కానీ.. దానిని దక్కించుకునేందుకు అనేక మెట్లు ఎక్కాల్సిన అవసరం వారసులకు ఉంటుందన్న విషయం గుర్తించాలి.
