Begin typing your search above and press return to search.

వైసీపీలో నెక్ట్స్ వికెట్ ఎవరు?! దూకుడు మీదున్న టీడీపీ

అయితే ఈ పరిణామాన్ని బొత్సతోపాటు వైసీపీలో ఏ ఒక్కరూ ముందుగా ఊహించకపోవడమే చర్చకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి ఇంకెవరైనా జంప్ చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   10 Sept 2026 10:00 PM IST
వైసీపీలో నెక్ట్స్ వికెట్ ఎవరు?! దూకుడు మీదున్న టీడీపీ
X

స్థానిక ఎన్నికల వేళ పార్టీలో చేరికలకు టీడీపీ గేట్లు ఎత్తడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికలకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగానే విపక్షాన్ని నైతికంగా దెబ్బతీయడానికి అధికార టీడీపీ వేగంగా పావులు కదుపుతోందని అంటున్నారు. దీనికి ఉదాహరణగా విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనును టీడీపీలోకి తీసుకురావడాన్ని చూపుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సకు స్వయాన మేనల్లుడు అయిన చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజికవర్గంపై పట్టు సాధించడమే కాకుండా విజయనగరం జిల్లాలో ఇంకా బలపడొచ్చని టీడీపీ హైకమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. దీంతో చిన్న శ్రీను చేరికను చాలా సైలెంట్ ఆపరేషన్ గా చేపట్టి సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. అయితే ఈ పరిణామాన్ని బొత్సతోపాటు వైసీపీలో ఏ ఒక్కరూ ముందుగా ఊహించకపోవడమే చర్చకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి ఇంకెవరైనా జంప్ చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు టీడీపీ ‘ఆపరేషన్ వైసీపీ’ స్టార్ట్ చేయడంతో విపక్షంలో కలకలం రేగిందని అంటున్నారు. సీనియర్ నేత బొత్స కుటుంబంలోని వ్యక్తినే టీడీపీ తన్నుకుపోవడంతో పార్టీలో మరికొందరు బలమైన నేతలను ఎత్తుకుపోయేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తుండవచ్చునని వైసీపీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో పార్టీలో ఇబ్బంది పడుతున్న నేతలు, పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం ఉన్న నేతలపై నిఘా పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటం, అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉందనే ఆలోచనతో ఎవరైనా టీడీపీ లేదా జనసేనతో టచ్ లోకి వెళ్లారా? అనే విషయమై వైసీపీ నేతలు ఆరా తీయడం స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు.

రెండేళ్ల క్రితం వైసీపీ అధికారం కోల్పోయిన సమయంలో చాలా మంది పక్కచూపులు చూశారనే ప్రచారం జరిగింది. దీనికి తగినట్లుగానే రాజ్యసభ, శాసనమండలి సభ్యత్వాలు ఉన్న కొందరు నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీతో చేతులు కలిపారు. ఆ తర్వాత మాజీ మంత్రులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లలో కొందరు కూడా కండువాలు మార్చేశారు. అయితే ఇంకా చాలా మంది జంపింగ్ కు సిద్ధమైనా టీడీపీ కేడర్ వ్యతిరేకించడంతో కొద్దిరోజులకే ఆపరేషన్ ఆకర్ష్ ని టీడీపీ అధిష్టానం ఆపేసిందని చెబుతున్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపు మంత్రమే వినిపించాలన్న ఆలోచనతో మళ్లీ ఆకర్ష్ కి తెరతీసినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగాం ఆపరేషన్ ఆకర్ష్ 2.0లో ముందుగా విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్నశ్రీనును పార్టీలోకి తీసుకున్నారని చెబుతున్నారు. మొదట్లోనే బిగ్ వికెట్ ను టచ్ చేయడంతో విపక్షం వైసీపీ కూడా అలర్ట్ అయిందని అంటున్నారు. దీంతో అనుమానం ఉన్న నేతలతో వైసీపీ అధిష్టానం చర్చలు మొదలుపెట్టిందని, పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తోందని చెబుతున్నారు. విపక్షంలో రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో అధికార పక్షం సంధిస్తున్న అస్త్రాలను అడ్డుకోవడం వైసీపీకి పెద్ద పరీక్షగా మారిందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ మారిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుతో ఆ జిల్లాలో ఇంకెవరు చేతులు కలపకుండా నిలువరించాలనే వ్యూహంతో పాటు ఇతర జిల్లాల్లోనూ టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్న నేతల జాబితాను అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు.