జగన్ 10 అడుగులు.. టీడీపీ 100 అడుగులు.. బాబా మజాకా.. !
తద్వారా రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా వచ్చే సంపతీని వైసీపీకి వెళ్లకుండా చూడాలన్నది టిడిపి ఆలోచనగా ఉంది.
By: Garuda Media | 28 April 2026 9:00 AM ISTవైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పాదయాత్ర ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది.. అనే విషయం ఆ పార్టీలో కంటే కూడా కూటమి పార్టీల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా టిడిపి ఈ విషయంలో ముందస్తు చర్యలు, ముందస్తు సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. సహజంగానే పాదయాత్ర అంటే సింపతి వస్తుంది. గతంలో జగన్ చేసిన పాదయాత్ర కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించింది. ఇది తిరుగులేని విజయంగా అప్పట్లో చర్చ నడిచింది. ఇక ఆ తర్వాత యువగళం పేరుతో నారా లోకేష్ చేసిన పాదయాత్ర కూడా టిడిపికి ఫలించింది.
తద్వారా 164 స్థానాల్లో విజయం సాధించిన కూటమిలో 135 స్థానాలు టీడీపీకి దక్కాయి. దీనికి యువ గళం పాదయాత్ర కారణమని చర్చ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రను లైట్‌గా తీసుకోకూడదని టిడిపి అంచనా వేస్తోంది. ప్రభుత్వం పరంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఇప్పటికీ వందల మంది సమస్యలు ఉన్నవారు టిడిపి కార్యాలయాలకు వస్తున్నారు. ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కు క్యూ కడుతున్నారు. అంటే సమాజంలో ఇంకా సమస్యలు సమసి పోలేదన్న విషయం స్పష్టం అవుతుంది.
వీరందరినీ ఏకం చేసేందుకు వైసిపి అధినేత జగన్ పాదయాత్రను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని టిడిపి అంచనా వేస్తోంది. దీంతో పాదయాత్ర ప్రారంభానికి ముందే ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటోంది. అదేవిధంగా కార్యకర్తలను నాయకులను ఈ విషయంపై అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్లస్టర్ ఇన్చార్జిల సమావేశాల్లో కావచ్చు, శిక్షణలో కావచ్చు ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. జగన్ పాదయాత్ర పేరును పైకి చెప్పకపోయినప్పటికీ అంతర్గత చర్చల్లో మాత్రం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్వయంగా చంద్రబాబు సూచించడం విశేషం.
తద్వారా రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా వచ్చే సంపతీని వైసీపీకి వెళ్లకుండా చూడాలన్నది టిడిపి ఆలోచనగా ఉంది. అంతేకాదు వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా కూటమి పార్టీలు బలంగా ముందుకు సాగాలన్న వ్యూహం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో దానిని మరింత బలోపేతం చేసే దిశగా టిడిపి అడుగులు వేస్తోంది. జగన్ పాదయాత్ర ద్వారా సాధించే సింపతి కన్నా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజల మొగ్గు చూపేలా నిరంతరం పార్టీని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గం, మండలాలు, గ్రామాలు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దానిని సమన్వయం చేసుకొని ముందుకు సాగేలా టిడిపి కార్యాచరణ సిద్ధం చేసింది.
తద్వారా పాదయాత్ర ఎఫెక్ట్ పార్టీ పై పడకుండా బలమైన విజయం మరోసారి దక్కేలా టిడిపి అధినేత పావులు కదుపుతున్నారు. అందుకే గత కొన్నాళ్లుగా క్లస్టర్ ఇన్చార్జిలకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు పార్టీ పరంగా నూతన నాయకత్వాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే పాదయాత్ర ఎఫెక్ట్ పై వైసీపీ కంటే కూడా టిడిపి ఎక్కువగా దృష్టి పెట్టింది. మరోసారి అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తోంది.
ఈ క్రమంలోనే వైసీపీపై మరిన్ని అంశాలతో ప్రజల మధ్యకు వెళ్లాలని చెబుతున్నారు. ఈ విషయంలో సక్సెస్ అయితే ఇక తిరుగు ఉండదనేది చంద్రబాబు ఆలోచన. పాదయాత్ర కంటే ముందే క్లస్టర్ ఇన్చార్జిలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉండేలా టిడిపి వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసింది. అంటే ఒకరకంగా జగన్ 10 అడుగులు వేసే లోపు టిడిపి వంద అడుగులు వేసే లాగా వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా వైసిపికి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దీనిని కార్యకర్తలు ఏ మేరకు సఫలీకృతం చేస్తారు అనేది చూడాలి.
