ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్.. మొత్తం భుజాన వేసుకున్న టీడీపీ మీడియా!
ఏపీలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి అరవ శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2026 11:00 PM ISTఏపీలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి అరవ శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అరవ శ్రీధర్ గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి ఆ తర్వాత జనసేనలో చేరారు. సర్పంచ్ గా పనిచేస్తూనే ఎమ్మెల్యేగా అవకాశం రావడం, పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజా వివాదంతో ఆయన పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఎమ్మెల్యే తనను పెళ్లి పేరుతో మోసం చేశారని ఓ వివాహిత ఆరోపణలు చేయడం, దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కూడా స్పందించడంతో విస్తృత చర్చ జరుగుతోంది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఈ విషయంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సైతం కార్నర్ చేసేలా వైసీపీ పావులు కదుపుతోంది. అయితే ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశించి వివాదాన్ని సర్దుమణిగించాలని జనసేన భావించిందని చెబుతున్నారు. కానీ, ఇక్కడ టీడీపీ, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో జరుగుతున్న చర్చ కూడా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. జనసేన పార్టీకి మించిన రీతిలో ఎమ్మెల్యే విషయంలో టీడీపీకి అనుకూలం గా ఉన్న కొన్ని సోషల్ మీడియా వేదికల్లో పోరాడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేను రక్షించేలా టీడీపీ అనుకూల సోషల్ మీడియా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిందని జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బాధితురాలి పై ఎదురుదాడి చేయడమే కాకుండా, ఆమె ఎమ్మెల్యేను ట్రాప్ చేసిందని టీడీపీ, జనసేన కు అనుకూలం గా ఉన్న కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ జనసేన ఎమ్మెల్యే కోసం టీడీపీ అనుకూల సోషల్ మీడియా పూర్తిస్థాయిలో రంగంలో దిగడమే రాజకీయంగా ప్రాధాన్యాంశంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేను ఆరోపణల నుంచి రక్షించడమే కాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ కు రక్షణ వలయంగా టీడీపీలోని ఓ వర్గం సోషల్ మీడియా ఫైట్ చేస్తోందని అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చినా జనసేన పార్టీ నుంచి టీడీపీ స్థాయిలో పెద్దగా ప్రతిఘటన కనిపించలేదని అంటున్నారు.
జనసేన సోషల్ మీడియా సైతం ఈ విషయంలో దిక్కులు చూసిందని, కానీ టీడీపీ కి అనుకూలం గా ఉండే సోషల్ మీడియా సర్వశక్తులు ఒడ్డి రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై ఆరోపణలను తిప్పికొట్టేందుకు శ్రమిస్తోందని చెబుతున్నారు. ఇలా వేరే పార్టీ ఎమ్మెల్యే విషయంలో టీడీపీ అనుకూల మీడియా పనిచేయడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఆపద సమయంలో కూడా మిత్రధర్మం పాటిస్తామని చెప్పడమే టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఉద్దేశం కావొచ్చని అంటున్నారు. గతంలో శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త హత్య ఎపిసోడ్ లో సొంత పార్టీ నేతపై జనసేన వేటు వేసింది. ఆ సంఘటనపై టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చినా జనసేన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని చెబుతున్నారు.
అందుకే తాజా ఎపిసోడ్ లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేనాని పవన్ కల్యాణ్ కు ఇబ్బంది కలగకుండా టీడీపీ అనుకూల సోషల్ మీడియా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్ల కూటమి నేతల మధ్య బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి రైల్వేకోడూరులో జనసేన నేత ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పెద్దరికం మొత్తం టీడీపీకి చెందిన సీనియర్ నేత రూపానందరెడ్డి చూస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక జనసేన నేతలు ఆత్మరక్షణలోకి వెళ్లినా, సోషల్ మీడియా ఎదురుదాడితో జనసేన వాయిస్ కూడా బలంగా వినిపించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
