Begin typing your search above and press return to search.

ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి టీడీపీ రెడీ

ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి దేశ రాజధాని ఢిల్లీలో ఒక స్థలం కేటాయించాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ని ఆ పార్టీ కోరుతోంది.

By:  Tupaki Desk   |   23 July 2025 9:41 PM IST
ఢిల్లీలో  పార్టీ  ఆఫీసు నిర్మాణానికి టీడీపీ రెడీ
X

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగున్నర దశాబ్దాలు. వెనక వచ్చిన కొన్ని పార్టీలు ఢిల్లీలో తమ సొంత పార్టీ ఆఫీసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్థలాలను తీసుకుని నిర్మించుకున్నాయి. తెలంగాణాకు చెందిన బీఆర్ఎస్ ఆ విధంగా కేంద్రం నుంచి స్థలం పొందింది అని చెబుతారు. ఇక అనేక ప్రాంతీయ జాతీయ పార్టీలకు స్థలం అడిగితే అన్ని విధాలుగా పరిశీలించి కేంద్రం కేటాయిస్తుంది.

ఇక ఇపుడు ఆ చాన్స్ టీడీపీ వాడుకోవాలని చూస్తోంది. కేంద్రంలో ఎటూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. పైగా టీడీపీ ఎంపీల మద్దతుతో ఉంది. దాంతో తమకు ఇపుడు అనేక వీలైన పనులను చేయించుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.

ఈ క్రమంలో నుంచి పుట్టుకుని వచ్చిన ఆలోచనే ఢిల్లీలో టీడీపీ ఆఫీసు నిర్మాణం. టీడీపీ అధినేతలు కీలక నేతలు ఢిల్లీకి వెళ్ళినపుడు ఆంధ్రా భవన్ లో అయినా ఉంటున్నారు. లేక పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర మంత్రుల నివాసంలో బస చేస్తున్నారు. ఇక ఢిల్లీలో పార్టీ సమావేశాలు ఎంపీలు పెట్టుకోవాలనుకున్నా ఫ్లోర్ లీడర్ నివాసం వద్దనో మరో చోటనో అది జరుగుతోంది.

జాతీయ స్థాయిలో చూస్తే టీడీపీ కీలకంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాలలో కేంద్రంలో అధికారం పంచుకుంది. అలాగే అనేక కూటముల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించింది. ఇంత చేసినా ఢిల్లీలో ఆ పార్టీకి సొంతంగా ఆఫీసు అయితే లేదు. దాంతో ఆ లోటు తీర్చుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి దేశ రాజధాని ఢిల్లీలో ఒక స్థలం కేటాయించాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ని ఆ పార్టీ కోరుతోంది. ఈ మేరకు టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి వద్దకు వెళ్ళి తమ పార్టీ తరఫున కీలక ప్రతిపాదనను ఆయనకు అందచేశారు. తమ పార్టీ ఆఫీసు కోసం అనువైన చోట స్థలం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు.

టీడీపీ ఎంపీల బృందానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నాయకత్వం వహించారు. ఆయన టీడీపీకి ఆఫీసు కోసం స్థలం ఇవ్వాలన్న దాని మీద మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కి పూర్తిగా వివరించారు. దేశంలో జాతీయ పార్టీలకు ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి. వాటి నిర్మాణం కోసం కేంద్రం స్థలం ఇస్తోంది. అలాగే పేరు గడించిన ప్రాంతీయ పార్టీలకు కూడా స్థలాలు కేటాయిస్తున్నారు.

కేంద్రం తలచుకోవాలే కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా స్థలం ఇవ్వడం అన్నది జరుగుతుందని చెబుతున్నారు. టీడీపీకి స్థలం ఇచ్చే విషయంలో ఏ అభ్యంతరాలు ఉండబోవని అంటున్నారు. మొత్తానికి తొందరలోనే టీడీపీకి కేంద్రం స్థలం ఇస్తే భారీ ఎత్తున భవన నిర్మాణం చేపట్టడం ద్వారా జాతీయ స్థాయిలో పసుపు జెండా రెపరెపలు మరింతగా జాతికి చూపించాలని ఆ పార్టీ తపన పడుతోంది.