Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ మీద బాబు హాట్ కామెంట్స్

ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సదస్సుకు తాను కూడా హాజరయ్యానని బాబు చెబుతూ కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించారు.

By:  Satya P   |   22 Feb 2026 1:00 AM IST
ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ మీద బాబు హాట్ కామెంట్స్
X

ఇంట్రెస్ట్ ఏముంది రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఆరోపణలు విమర్శలు ఎవరైనా చేయరా అని అనుకోవచ్చు. కానీ అది వేరే విషయం. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు సైతం కాంగ్రెస్ మీద పెద్దగా ఏంటి అసలు విమర్శలు చేసినది లేదని అంటారు. 2018లో ఎన్డీయేతో కటీఫ్ తరువాత కాంగ్రెస్ తో కలసి టీడీపీ ప్రయాణించింది. 2018 లో తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వెళ్లింది అఫ్ కోర్స్ ఆ ఎన్నికల్లో ఓటమి సంభవించిన తరువాత టీడీపీ కాంగ్రెస్ కి దూరం జరిగింది. తిరిగి 2024 ఎన్నికల నాటికి ఎన్డీయే వైపు మొగ్గు చూపించింది. ఆ విధంగా ఏపీలో అధికారంలోకి టీడీపీ వచ్చింది. ఏపీలో ప్రభుత్వాన్ని ఎన్డీయే సర్కార్ గానే చెబుతారు. అలాగే కేంద్రంలో చూస్తే ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీకి చెందిన మంత్రులు ఉన్నారు. ఇలా ఎంత అనుబంధం రాజకీయంగా కమలంతో ఉన్నా కమలానికి జాతీయ స్థాయిలో ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ ని టీడీపీ ఎప్పుడూ విమర్శించినది లేదు.

అది కూడా రీజన్ కావచ్చు :

ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ నామమాత్రం అయింది. దాంతో కాంగ్రెస్ పార్టీని పెద్దగా విమర్శించినా ఉపయోగం లేదన్న మాట కూడా ఉంది. దాంతో కూడా టీడీపీ ఆ ఊసే తలవకుండా ముందుకు సాగుతోంది. కానీ చిత్రంగా ఒకేసారి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ కాంగ్రెస్ ని విమర్శించారు. ఢిల్లీలోని భారత మండపంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇండియా ఏఇ ఇంపాక్ట్ సమ్మిట్ కి విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు వచ్చారు. సమ్మిట్ సక్సెస్ అయింది అని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సమ్మిట్ ప్రాంగణం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. దాంతో బీజేపీ పెద్ద ఎత్తున మండిపడింది. కాంగ్రెస్ కి నూతన ఆవిష్కరణలు అంటే ఇష్టం లేదని కూడా కామెంట్స్ చేసింది. అదే సమయంలో బాబు కూడా గట్టిగా ఖండించారు.

కాంగ్రెస్ ప్రవర్తన దారుణం :

ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సదస్సుకు తాను కూడా హాజరయ్యానని బాబు చెబుతూ కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. సుమారు 60 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాల్లో ఏఐ ఏం చేస్తుందో అందరికీ ఈ సదస్సు ద్వారా తెలియచెప్పారు. ఢిల్లీలో ఇంత మంచి సదస్సు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వాళ్లు దారుణంగా ప్రవర్తించారని బాబు ఫైర్ అయ్యారు. ఓవైపు ప్రపంచమంతా టెక్నాలజీలో ముందుకుపోతుంటే యువత ప్రయోజనాలు కాపాడాల్సిన పార్టీలు అర్ధనగ్న ప్రదర్శన చేయడం ఎంతో బాధించింది అంటూ కాంగ్రెస్ మీద బాబు హాట్ కామెంట్స్ చేశారు. తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ ఈ తరహా శైలి దేశానికి నష్టం చేస్తుందని ఆయన అన్నారు. ఏపీలో కూడా గత ఐదేళ్లలో ఏం జరిగిందో అంతా చూశారని బాబు చెప్పారు. ఏపీ అంటే అప్పట్లో అందరూ ఛీ కొట్టారని అన్నారు. ఏకంగా . పారిశ్రామికవేత్తలు పారిపోయారని ఆయన వైసీపీ ప్రభుత్వం మీద విమర్శించారు. ఇక లోకేష్ సైతం కాంగ్రెస్ వ్యవహార శైలిని పూర్తిగా తప్పు పట్టారు. ఈ వైఖరి మంచిది కాదని ఆయన అన్నారు.

అసలు ఎందుకిలా :

నిజానికి కాంగ్రెస్ ఎక్కడో ఢిల్లీలో ఏఐ సదస్సు ప్రాంగణం వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తే తెలుగుదేశం పనిగట్టుకుని మరీ ఖండించాల్సిన అవసరం అయితే లేదు అని అంటున్నారు. పైగా బీజేపీ నేతలు మాత్రమే రియాక్ట్ అయ్యారు. ఎన్డీయే మిత్రులు ఎక్కడా పెద్దగా స్పందించినది లేదు. కానీ టీడీపీలో చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఖండించడం కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ల మధ్య రాజకీయ పోరు భీకరంగా సాగుతోంది. బీజేపీ అయితే గట్టిగా పోరాడుతోంది. ఈ సమయంలో నమ్మకమైన మిత్ర పక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ ఈ విధంగా వ్యవహరించింది అని అంటున్నారు. ఎంతో ముందు చూపుతోనే ఈ విధంగా కాంగ్రెస్ ని విమర్శించారు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.