Begin typing your search above and press return to search.

రాజ్యసభకు టీడీపీ : మూడో సీటు ఆమెకు ?

తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎకాఎకీన మూడు రాజ్యసభ సీట్లు దక్కుతున్నాయి. బీజేపీకి నో చాన్స్ అంటూ కూటమి చెప్పేసింది.

By:  Satya P   |   6 Jun 2026 12:39 AM IST
రాజ్యసభకు టీడీపీ : మూడో సీటు ఆమెకు ?
X

తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎకాఎకీన మూడు రాజ్యసభ సీట్లు దక్కుతున్నాయి. బీజేపీకి నో చాన్స్ అంటూ కూటమి చెప్పేసింది. జనసేనకు ఒక సీటు కేటాయించింది. దాంతో టీడీపీ మూడు సీట్లలో ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే అందరూ ఊహించినట్లుగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేవలం ఏణ్ణర్ధం పదవీ కాలం మాత్రమే పనిచేసి రిటైర్ అయిన సానా సతీష్ కి మరోసారి రెన్యూవల్ చేస్తారు అని అంటున్నారు. అలా ఆయనకు సీటు కన్ఫర్మ్ అయినట్లే అని చెబుతున్నారు. అలాగే రెండవ సీటుని కిలరు రాజేష్ కి కేటాయించారని ప్రచారం సాగుతోంది. కిలా గోదావరికి చెందిన సానా సతీష్, కృష్ణా జిల్లాకు చెందిన రాజేష్ లకు రెండు సీట్లూ కన్ఫర్మ్ చేయగా మూడవ సీటు ఎవరికీ అన్నది కూడా చర్చగా మారింది.

మహిళా కోటాలో :

ఇక మూడవ సీటు మహిళా కోటాను పాటించి ఒకరికి ఇస్తారు అని అంటున్నారు. ఇటీవలనే టీడీపీ మహానాడులో మహిళలకు మూడవ వంతు సీట్లు అన్ని చోట్లా ఇస్తామని ప్రకటించింది. అది జరిగిన వెంటనే వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తాము చేసిన ప్రకటనలోని నిజాయతీని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ఈ లెక్కన మూడవ సీటు మహిళకే అని అంటున్నారు.

బీసీ వర్గానికి సైతం :

ఇక సామాజిక అంశాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకుంటుంది అని అంటున్నారు. బీసీలకు మూడవ సీటు ఇస్తారని చెబుతున్నారు. అయితే గూడ లేకపోతే యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఈ సీటు ఇస్తారని అంటున్నారు. అంతే కాదు ప్రాంతీయ సమీకరణలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేస్తారు అని అంటున్నారు.

అనూహ్యమైన అభ్యర్థిగా :

అయితే అనూహ్యమైన వారే మూడవ సీటుకు నామినేట్ అవుతారు అని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి గడచిన కొంతకాలంగా చూస్తే మహిళలు రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భాలు లేవు. ఎపుడో తోట మహాలక్ష్మి గుండు సుధారాణిలకు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ ఎవరూ లేరని కూడా గుర్తు చేస్తున్నారు. దాంతో ఈసారి ఇచ్చే వారిని కూడా సరైన వ్యక్తులకు ప్రజల వాణిని పెద్దల సభలో వినిపించే వారికి ఇస్తారు అని అంటున్నారు.

వీరికి నిరాశేనా :

ఇవన్నీ పక్కన పెడితే సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. రాజ్యసభకు వెళ్ళాలన్నది ఆయన చిర కాల కోరిక. ఆయన 2014 నుంచి అదే ప్రయత్నంలో ఉన్నారని చెబుతారు. కానీ పుష్కర కాలం గడచినా ఆయన కోరిక అయితే తీరడం లేదని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కి రాజ్యసభ సీటు దక్కుతుందని ఒక దశలో విపరీతమైన ప్రచారం సాగింది కానీ అది కూడా నిజం కాదని తేలిపోతోంది అంటున్నారు. మొత్తం మీద రాజ్యసభకు ఇద్దరు పురుషులతో పాటు ఒక మహిళను కూడా పంపడం ద్వారా అన్ని సమీకరణలను పరిపూర్తి చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.