టీడీపీలో రాజ్యసభ రగడ.. కడప నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సంచలన ట్వీట్!
టీడీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక తీవ్ర చర్చగా మారుతోంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై సీనియర్లు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 8 Jun 2026 6:21 PM ISTటీడీపీ అంటే ఎంతో క్రమశిక్షణ అని చెప్పుకుంటుంది ఆ పార్టీ హైకమాండ్. క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి అధినేత వరకు అంతా ఒకే మాట.. ఒకే బాట అన్నట్లు నడుచుకోవాలనేది టీడీపీ సిద్దాంతం. పార్టీలో భిన్నాభిప్రాయాలకు అసలు చోటే ఉండదని అంటుంటారు. సామాన్య కార్యకర్తలు అయినా సరే బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయకూడదు. ఏదైనా నాలుగు గోడల మధ్యే ఉండాలి అన్న నియమ నిబంధనలతోనే టీడీపీ నడుస్తుందని అంటారు. కానీ, తొలిసారిగా ఈ క్రమశిక్షణకు బీటలు వారుతుందా? అన్న చర్చే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజ్యసభ సభ్యుల ఎంపికపై పార్టీ సీనియర్లు నుంచి వస్తున్న స్పందన ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
టీడీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక తీవ్ర చర్చగా మారుతోంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై సీనియర్లు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే చాలా మంది తమ ఆవేదనను మనసులో దిగమింకుంటే కొందరు సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ లిస్టులో కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అగ్రస్థానంలో నిలుస్తున్నారు. రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న శ్రీనివాసరెడ్డి.. లిస్టులో పేరు లేకపోయే సరికి షాక్ తిన్నారు. దీంతో తన ఆవేదనను ‘ఎక్స్’వేదికగా వెల్లగక్కారు.
‘‘గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం.’’ అంటూ ఎక్స్ లో తన ఆవేదన పంచుకున్నారు శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుందంటూ వాపోయారు. అయినప్పటికీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటానంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు.
రాజ్యసభ స్థానాన్ని ఆశించిన శ్రీనివాసరెడ్డి నిరాశ చెందడంలో తప్పులేదని, కానీ బహిరంగంగా ఇలా కామెంట్ చేయడమే చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. టీడీపీ సంస్కృతిలో లేని పని చేసిన శ్రీనివాసరెడ్డి పార్టీలో కొత్త చర్చకు తెరతీశారని అంటున్నారు. గత ఏడాది కడపలో మహానాడు నిర్వహించి అధిష్టానం అభినందనలు అందుకున్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఇలా ఎదురు తిరగడమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. కడపలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఎదుర్కొని రాజకీయం చేస్తున్న తనకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే సామాజిక సమీకరణాలు కుదరకే శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ శ్రీనివాసరెడ్డి పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై అనుకూల, వ్యతిరేక వర్గాల నుంచి కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి పెట్టిన ఈ పోస్టు 24 గంటల్లో దాదాపు 4 లక్షల మంది చూడగా వందల మంది కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి భార్య మాధవీరెడ్డికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పదవులు ఉండగా, మళ్లీ రాజ్యసభ స్థానం అడగడం న్యాయమా? అంటూ టీడీపీ సానుభూతిపరులు ప్రశ్నిస్తుంటే, వెన్నుపోటు అంటూ వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరికొందరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫొటోను కామెంట్ బాక్సులో పోస్టు చేస్తూ అసమ్మతి క్లబ్ కు స్వాగతం అంటూ రాస్తున్నారు. మొత్తానికి టీడీపీ సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పెట్టిన పోస్టు ఏపీ టీడీపీలో కాక రేపుతోందని అంటున్నారు.
