టీడీపీకి అచ్చిరాని ‘రాజ్యసభ’.. పెద్దల సభకు వెళ్లిన తర్వాత తిరుగుబాటేనా?
అధికార తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరావడం లేదా? అనే అంశం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Political Desk | 9 Dec 2025 12:00 PM ISTఅధికార తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరావడం లేదా? అనే అంశం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో సుమారు 40 మంది వరకు నేతలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. పార్టీలో అత్యంత సీనియర్లు, ఇతర నేతలను దిశానిర్దేశం చేసే నేతలే ఎక్కువగా రాజ్యసభకు వెళ్లారు. అయితే అలా పెద్దల సభకు అడుగుపెట్టిన వారు ఆ తర్వాత కాలంలో పార్టీని వీడటం, ముఖ్యంగా అధినేతలపై తిరుగుబాటు చేయడం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎన్నికైన నేతల నుంచి చంద్రబాబు 3.0 ప్రభుత్వంలో ఎన్నికైన నేతల వరకు చూస్తే టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన నేతలలో ఎక్కువ మంది పార్టీపై తిరుగుబాటు చేసిన వారే కనిపిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలుత రాజ్యసభకు ఎన్నికైన నేతల్లో కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర, మాజీ గవర్నర్ సత్యానారాయణరెడ్డి. యల్లా శశిభూషణరావు, పుట్టపాక రాధాకృష్ణ వంటి వారు ప్రముఖులు. అయితే ఉపేంద్ర, మాజీ గవర్నర్ సత్యానారాయణరెడ్డి తమ పదవీకాలం పూర్తయిన తర్వాత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇదేవిధంగా ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన రేణుకా చౌదరి, ఎన్.తులసిరెడ్డి, మోహన్ బాబు, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, కిమిడి కళావెంటరావు, సి.రామచంద్రయ్య తదితరులు కూడా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన తర్వాత టీడీపీకి రాంరాం చెప్పేశారు.
ఎన్టీఆర్ తదనాంతరం మోహనబాబు, యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, సి.రామచంద్రయ్య టీడీపీకి రాజీనామా చేశారు. యార్లగడ్డ, మోహన్ బాబు ఆ తర్వాత టీడీపీ వైపు చూడనేలేదు. సి.రామచంద్రయ్య రాజీనామా చేసి తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో కొన్నాళ్లు పనిచేశారు. గత ఎన్నికల ముందు తిరిగి టీడీపీలోకి వచ్చారు రామచంద్రయ్య. అదేమాదిరిగా కిమిడి కళావెంకటరావు సైతం ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభకు పంపింది టీడీపీ అధిష్టానం. అయితే ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రజారాజ్యంలో అడుగుపెట్టి అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. ఇక రేణుకాచౌదరి, జయప్రద, వంగా గీత, గుండు సుధారాణి వంటి మహిళా నేతలు సైతం టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పెద్దల సభలో అడుగుపెట్టారు. వీరంతా ఆ తర్వాత కాలంలో పార్టీకి దూరమయ్యారు.
అదేవిధంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరిపాటి మోహనరావు గతంలో ఏకంగా పార్టీని వీడటమే కాకుండా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని ఏకంగా బీజేపీలో విలీనం చేశారు. ఈ నలుగురిలో సుజనా చౌదరికి కేంద్ర మంత్రిగా కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. సీఎం రమేశ్, సుజనా చౌదరి వంటి వారు వ్యాపార కార్యకలాపాల వల్ల పార్టీ మారాల్సివచ్చిందని అధినేతకు చెప్పారని అప్పట్లో ప్రచారం జరుగుగా, అంతకుముందు పార్టీని వీడిన వారంతా కేవలం రాజకీయాల కోసం టీడీపీని వీడటం చర్చనీయాంశం అవుతోంది. అసలు ఈ చర్చ ఇప్పుడే ఎందుకు? జరుగుతుందని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి,
ప్రస్తుతం టీడీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. మరో ఆర్నెల్లలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని చెబుతుండగా, ఇప్పుడే ఆశావహులు పార్టీపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారని అంటున్నారు. దీంతో గత అనుభవానలను దృష్టిలో పెట్టుకుని పెద్దల సభకు నేతలను ఎంపిక చేయాలని పార్టీ అధినేత చంద్రబాబుకు సీనియర్లు సూచిస్తున్నారని అంటున్నారు. పార్టీ పట్ల విధేయుత చూపిన వారినే రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయాలని, స్వార్థం కోసం రాజకీయాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించొద్దని సూచిస్తూ, పార్టీ ఆవిర్భావం నుంచి చోటుచేసుకున్న పరిణామాలను నేతలు వివరిస్తున్నారని అంటున్నారు.
