Begin typing your search above and press return to search.

వైసీపీ చాలా ప్రమాదకరం...అల్టిమేట్ కామెంట్!

తాజాగా చంద్రబాబు ఉంగుటూరులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సభలో మాట్లాడుతూ వైసీపీ మీద ఘాటైన విమర్శలు చేశారు.

By:  Satya P   |   2 Dec 2025 3:00 AM IST
వైసీపీ చాలా ప్రమాదకరం...అల్టిమేట్ కామెంట్!
X

ఆరోగ్యానికి హానికరం అని ప్రతీ సిగరెట్ పెట్టె వెనకా రాసి ఉంటుంది. ఇపుడు అలాంటి పవర్ ఫుల్ స్లోగన్ ని టీడీపీ కూటమి ఎంచుకుంది. దానిని మెల్లగా జనంలోకి తీసుకుని వెళ్ళడం ద్వారా ఇప్పటి నుంచే వైసీపీకి మీద రాజకీయ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చూస్తోంది నిజానికి చూస్తే కనుక ఏపీలో రాజకీయ విమర్శలు అయితే ఎన్నికల తరువాత కూడా ఒక రేంజిలో సాగుతున్నాయని చెప్పాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజలలో ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రతీ నెలా సామాజిక పెన్షన్లను అందచేసే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో నెల ఒక్కో జిల్లాకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా వేదిక సభను నిర్వహించి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు సోదాహరణంగా చెబుతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం వైఫల్యాలను కూడా విడమరచి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు ఉంగుటూరులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సభలో మాట్లాడుతూ వైసీపీ మీద ఘాటైన విమర్శలు చేశారు.

ఒక్క ఘటన చాలు :

వైసీపీ ఎంతో ప్రమాదకరమని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో బాబాయిని గొడ్డలితో చంపి వేరే వారిపై నెపం నెట్టేశారని దానిని బట్టి చూస్తే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవాలని అన్నారు. ఆ తరహా నేరాలు రాష్ట్రంలో నడిపిస్తున్నారని ఆయన వైసీపీ మీద విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు జరిగాయని ఆయన గుర్తు చేశారు తమ ప్రభుత్వం హయాంలో ఆలయాలు ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు.

దోచుకోవడమే పని :

వైసీపీ పాలనలో గత పాలకులకు దోచుకోవడం, దాచుకోవడమే మాత్రమే తెలుసు అని బాబు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో అభివృద్ధి అంటే వారికి నచ్చదని ఆయన మండిపడ్డారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని తర్వాత వచ్చినవాళ్లు అడ్డుకోలేదని బాబు చెప్పారు. కానీ వైసీపీ పాలకులు మాత్రం రాష్ట్రాన్ని పూర్తిగా అడ్డుకోవడమే కాకుండా ఏపీని గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఎక్కడా ఆనాడు లేకుండా పోయింది అని ఆయన అన్నారు.

పేటెంట్ మాదే :

ఏపీలో సంక్షేమ పధకాల అమలులో నంబర్ వన్ కూటమి ప్రభుత్వం అని చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్ ని అమలు చేయలేరని అన్నారని తాము అమలులో చేసి చూపించామని బాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందలేదని కానీ కూటమి ప్రభుత్వంలో ఆ ఇబ్బందుల లేవని అన్నారు కేవలం డిసెంబర్ నెలలోనే కొత్తగా 7 వేల 533 మందికి 3 కోట్ల రూపాయలతో వితంతు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇక గడిచిన ఐదేళ్లలో ఒక్క నెల పింఛను తీసుకోకపోయినా ఎగ్గొట్టేవారని బాబు విమర్శించారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా :

కూటమి ప్రభుత్వంలో రెండు నెలలుగా పెన్షన్ తీసుకోని ఒక లక్షా 39 వేల 677 మందికి 114 కోట్ల రూపాయలను విడుదల చేశామని బాబు ప్రకటించారు. అలాగే గత కొన్ని నెలలుగా పెన్షన్ తీసుకోని 13,325 మందికి 16 కోట్లు విడుదల చేశామని అన్నారు. ఇక సామాజిక పెన్షన్లకు 1984లో ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. దాన్ని సక్రమంగా పెంచుతూ ప్రస్తుతం నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బాధ్యతగా ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచనుగా పింఛను అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ముక్కుతూ మూలుగుతూ 250 మాత్రమే పెంచారని బాబు విమర్శించారు.