Begin typing your search above and press return to search.

అక్కడ పోటీకి టీడీపీ దూరం ?

అలాగే ఖమ్మం, నల్గొండ, నిజమాబాద్, మహబూబ్ నగర్ వంటి చోట్ల అక్కడక్కడ కొంత పట్టు కలిగి ఉంది.

By:  Tupaki Desk   |   13 July 2025 2:00 PM IST
అక్కడ పోటీకి టీడీపీ దూరం ?
X

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగు నాట ఏ పార్టీకి లేని చరిత్ర ఉంది. ఉమ్మడి ఏపీని ఏకంగా 18 ఏళ్ళ పాటు ఏలిన చరిత్ర టీడీపీది. ఎన్నికల రాజకీయాల్లో ఎన్నెన్ని మెరుపు షాట్లు కొట్టిందో టీడీపీకే తెలుసు. రాజకీయంలో వేగం దూకుడు అన్నవి ఆ పార్టీ నుంచే వచ్చాయి. 1983లో హైదరాబాద్ లో టీడీపీ పుట్టింది. తెలంగాణలో పుట్టి అక్కడ ఈ రోజుకీ గ్రాస్ రూట్ లెవెల్ లో అంతో ఇంతో బలం ఉన్న టీడీపీ ఇపుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుందా అన్న చర్చ సాగుతోంది.

ఏపీలో బలమైన పార్టీగా మరింతగా మారుతోంది. మరో నాలుగు దశాబ్దాలకు తగిన విధంగా తన రూపురేఖలను మార్చుకుంటోంది. కొత్త నీరుకు చోటిస్తోంది. అన్ని రకాలుగా టీడీపీ ఏపీలో పరిపుష్టం అవుతోంది. దానికి 2024 ఎన్నికలు ఇచ్చిన బూస్టింగ్ వేరే లెవెల్ అని చెప్పాల్సిన పని లేదు.

అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన ఆ సందర్భంలోనే తెలంగాణాలోనూ టీడీపీ మళ్ళీ తన జెండాను గర్వంగా ఎగరేస్తుందని అంతా భావించారు. టీడీపీ అధినాయకత్వం కూడా మొదట్లో ఆ దిశగా సంకేతాలు ఇచ్చింది. అంతే కాదు పార్టీని తెలంగాణాలోనూ విస్తరిస్తామని చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి హోదాలో హాజరైన సభలలో చెప్పారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అలాంటి సూచనలు ఏవీ లేకుండా పోతున్నాయి.

తెలంగాణాలో టీడీపీ అయితే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లాంటి చోట కొంత పట్టు కలిగి ఉంది. అలాగే ఖమ్మం, నల్గొండ, నిజమాబాద్, మహబూబ్ నగర్ వంటి చోట్ల అక్కడక్కడ కొంత పట్టు కలిగి ఉంది. అయితే బీఆర్ఎస్ ఓడిన నేపధ్యంలో మొదట్లో టీడీపీ రీ ఎంట్రీకి ఇది సరైన సందర్భం అని అంతా అనుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్న వారిలో అధికులు టీడీపీకి చెందిన వారే కాబట్టి.

అయితే టీడీపీకి ఆంధ్రా పార్టీ అన్న ముద్ర ఉంది. పైగా ఏపీ సీఎం గా బాబు ఉన్నారు. దాంతో ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడిన ప్రతీసారీ ఆయనకు ఆంధ్ర పక్షపాతిగానే చూపిస్తారు. మరో వైపు చూస్తే బలమైన నాయకత్వం కనుక అందిస్తే 2028 ఎన్నికల వేళకు బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకుని తెలంగాణాలోనూ కూటమి కట్టి అధికారంలో భాగం పంచుకోవచ్చు అని అనుకున్నారు.

కానీ తెలంగాణా బీజేపీ అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అంత సుముఖంగా లేదని అంటున్నారు ఎపుడైతే పొత్తులు పెట్టుకుంటారో అది బీఆర్ఎస్ కి అంది వచ్చిన అస్త్రం అవుతుందని దాంతో తెలంగాణాలో బీజేపీకి అనుకూలత బాగా తగ్గిపోతుందని కమలనాధులు చింత పడుతున్నారు. దాంతో టీడీపీ విషయంలో మొహమాటం లేకుండా వారు నో చెప్పేస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే జమిలి ఎన్నికలు వస్తాయని అంటున్న నేపధ్యంలో ఒకేసారి ఏపీ తెలంగాణాలలో ఎన్నికలు జరిగితే అక్కడ తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడితే ఏపీలో అసలుకే ఎసరు వస్తుందని ఇదంతా ఎందుకొచ్చిన తంటా అని భావిస్తున్న టీడీపీ పెద్దలు తెలంగాణాలో పార్టీ ఉందంటే ఉంది అన్నట్లుగానే అలా ఉంచేస్తున్నారు.

అయితే పాత కమిటీలను రద్దు చేసిన టీడీపీ అధినాయకత్వం కొత్తగా కమిటీలు వేయకపోవడం మీద కూడా తెలంగాణా తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. టీడీపీని జాతీయ పార్టీగా చూపించుకునేందుకే తెలంగాణాలో పార్టీ ఉందని చూపిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట.