Begin typing your search above and press return to search.

బాబును కలవాలి.. బాధలు చెప్పుకోవాలి!

రాష్ట్రంలో దాదాపు 72 నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్నట్లు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   25 May 2025 8:00 PM IST
బాబును కలవాలి.. బాధలు చెప్పుకోవాలి!
X

టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. గత ఏడాది ఇదే సమయంలో ఎన్నికల కోలాహలంలో ఆ పార్టీ శ్రేణులు తీరిక లేకుండా గడిపాయి. రిజల్స్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశాయి. ఆ తర్వాత చిరస్మరణీయ విజయంతో ఎంతో సంతృప్తి చెందాయి. అయితే ఎన్నికల ఫలితాల వరకు కలిసికట్టుగా పనిచేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నడుస్తున్నారని పలు కథనాలు వస్తున్నాయి. మహానాడుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మినీ మహానాడుల్లో టీడీపీలో అంతర్గత విభేదాలు వెలుగుచూశాయి. ఏడాదిగా గుంభనంగా ఉన్న గ్రూపు తగాదాలు ఒక వేదిక ఏర్పడగానే బహిర్గమవడంతో అగ్రనాయకత్వం కూడా టెన్షన్ పడుతోందని అంటున్నారు.

ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే పార్టీలో అసంతృప్తులు పెరిగిపోవడంపై టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. పార్టీలో అంతలా అసమ్మతి పెరిగిపోవడానికి కారణాలు ఏంటీ అనేది తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఒకటే అంటున్నారు నేతలు. ‘‘బాబును కలవాలి.. తమ బాధలు చెప్పుకోవాలనేదే’’ టీడీపీ కేడర్ నుంచి వినిపిస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం కేటాయించకపోవడం వల్లే నియోజకవర్గాల్లో ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో దాదాపు 72 నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్నట్లు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్లకు టికెట్ దక్కని నేతలకు విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. తిరువూరు, గన్నవరం, గుడివాడ, పాలకొండ, పెందుర్తి వంటి నియోజకవర్గాలను ఉదాహరణగా చూపుతున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మరికొన్ని చోట్ల పార్టీ ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్న నేతలతో సీనియర్లకు పొసగడం లేదని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ అధికారంలోకి వచ్చిన తమకు పదవులు దక్కడం లేదని కొందరు భావిస్తుండగా, తమ పనులు జరగడం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నడూ లేనట్లు చంద్రబాబు పాలనలో ఏడాది కాలంలోనే పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఎమ్మెల్యే స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టారు. అదేవిధంగా నియోజకవర్గస్థాయి నేతలకు జిల్లాస్థాయిలో పదవులు కేటాయించారు. అయితే పదవులు ఆశిస్తున్న వారి లిస్టు ఇంకా పెద్దగానే ఉంది. ఏఎంసీలు, గ్రంథాలయ సంస్థలు, సహకార సంఘాల్లో పదవులను ఇంకా భర్తీ చేయాల్సివుంది. ఈ పదవులు పెండింగులో పెట్టడానికి తమ ఎమ్మెల్యేలే కారణమని ఎక్కవు మంది రగిలిపోతున్నారు. అయితే ప్రభుత్వం నియామకాలు చేయాలి కానీ, తామేం చేస్తామని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ముఖ్యమంత్రి సమయం ఇస్తే ఈ విషయాలను చెప్పుకుని తమ నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్కదిద్దుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అధికారిక కార్యక్రమాల వల్ల చంద్రబాబు ఎప్పటిలా బిజీ అయిపోవడంతో రాజకీయంగా సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. పార్టీకి ఆయన ఇచ్చే సమయం చాలా తక్కువ. అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఒకటే చెబుతారు. ఈ సారి అధికారంలోకి వస్తే పార్టీకి ఎక్కువ సమయం ఇస్తానని.. కానీ, అధికారంలోకి రాగానే ఆయన తన పాత మాటలను మరచిపోతారని విమర్శలు ఎదుర్కుంటుంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాదిగా సీఎం తమకు తగిన సమయం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలతోపాటు పార్టీ సీనియర్లు ఆవేదన చెందుతున్నారు.

ఈ మహానాడులో తమ అభిప్రాయాలు చెప్పుకోడానికి తగిన సమయం కేటాయించాలని ఎక్కువ మంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మూడు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో గడపనున్నందున వ్యక్తిగతంగా ఆయనను కలిసే అవకాశం కల్పించాలని పార్టీ నేతలు, కేడర్ కోరుతున్నారు. అయితే నేతలు, కార్యకర్తల మొరను అధినేత చంద్రబాబు ఆలకిస్తారా? అన్నదే ఉత్కంఠ రేపుతోంది.