టీడీపీలో ఎప్పుడూ చూడని రాజకీయం.. ఇలా ఎందుకు జరుగుతోంది?
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చిన ఆ పార్టీలో తొలిసారిగా కట్టుతప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 8 Sept 2025 1:00 AM ISTతెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చిన ఆ పార్టీలో తొలిసారిగా కట్టుతప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం మొత్తం పార్టీ బలం పుంజుకున్న పరిస్థితుల్లో జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ.. కార్పొరేషన్ చైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యే ఇలా ప్రతి చోటా స్థానిక నేతల మధ్య వార్ నడుస్తోందని అంటున్నారు. ఏ ఇద్దరు నేతలు సర్దుకుపోవడం లేదని, పార్టీ కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటీవల కాలంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని, ఇవి పార్టీకి నష్టం చేకూర్చుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు పవర్ సెంటర్స్ గా ఉండేవారు. పార్టీ హైకమాండ్ నుంచి క్షేత్ర స్థాయి వరకు ఎవరైనా అధినేత చెప్పినట్లే నడుచుకునేవారు. జిల్లా స్థాయిలో తీసుకునే ఏ నిర్ణయమైనా పార్టీ అధినేతకు తెలియకుండా ఉండేది కాదు. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నా, కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం అధినేత చంద్రబాబుతోపాటు యువనేత లోకేశ్ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల కొన్నిచోట్ల సీనియర్, జూనియర్ నేతల మధ్య అంతరం కనిపిస్తోందని అంటున్నారు. జిల్లాల్లోని కీలక నిర్ణయాల విషయంలో చంద్రబాబుకు చెప్పి చేస్తున్నామని కొందరు.. చినబాబు లోకేశ్ దృష్టిలో పెట్టామని మరికొందరు గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల మధ్య సఖ్యత కనిపించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో పార్టీలోకి కొత్తగా వచ్చి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న నేతలతో పాత నేతలకు పొసగడం లేదని అంటున్నారు. దీనికి ఇటీవల అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరాటం వల్లే పార్టీ పరువు బజారున పడిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య కూడా గ్రూప్ వార్ నడుస్తోందని చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేనట్లు ఈ అంతర్గత యుద్ధంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండేవి కావని, ఎవరికైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టి పెట్టి పరిష్కరించుకునేవారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరూ అంత సహనంతో ఉండటం లేదని అంటున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్ఛాపురం వరకు ఇదే విధమైన వాతావరణం కనిపిస్తోందని టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించే పరిశీలకులు చెబుతున్నారు. దీనికి తోడు మిత్రపక్షాలతోనూ పేచీకి దిగుతున్న మరికొందరు నేతలు పార్టీకి తలనొప్పులు తెస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా పార్టీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఈ వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అంటున్నారు.
ఒకప్పుడు పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే సుప్రీంగా ఉండేవారని, కానీ ఇప్పుడు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సుప్రీంగా భావించుకుంటున్నారని అంటున్నారు. దీనివల్ల మంత్రులు కూడా తమ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోతున్నారని అంటున్నారు. ఏ మంత్రి అయినా జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనలకు వెళ్లాలంటే సంబంధిత ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేల మధ్య సహృద్భావ, సోదర భావం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పక్కపక్క నియోజకవర్గాలకు చెందిన నేతలు సహకరించుకుంటేనే వ్యక్తిగతంగా వారికి, పార్టీకి మేలు జరుగుతుందని, కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇది పార్టీకి ఓ విధంగా డేంజర్ సిగ్నల్ గానే పరిగణించాలని అంటున్నారు.
