Begin typing your search above and press return to search.

తప్పు మీద తప్పు.. తమ్ముళ్లు తిట్టిపోస్తేనే కళ్లు తెరుస్తారా బాబు?

ఒకసారి జరిగితే దాన్ని తప్పు అనొచ్చు. కానీ.. అదే పనిగా జరిగితే ఏమనాలి? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగు తమ్ముళ్ల నుంచి వస్తోంది.

By:  Tupaki Desk   |   6 May 2025 10:04 AM IST
తప్పు మీద తప్పు.. తమ్ముళ్లు తిట్టిపోస్తేనే కళ్లు తెరుస్తారా బాబు?
X

ఒకసారి జరిగితే దాన్ని తప్పు అనొచ్చు. కానీ.. అదే పనిగా జరిగితే ఏమనాలి? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగు తమ్ముళ్ల నుంచి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయనకు వ్యతిరేకంగా పని చేసి.. కేసులు పెట్టిన సందర్భంలో ఆయన్ను ఇరుకున పెట్టేలా వ్యవహరించిన వారికి వరుస పదవులు లభించటం.. కీలక స్థానాల్లో నియమించటం లాంటి చర్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ.. కీలక అధికారులకు ముఖ్యమైన పోస్టింగులు కేటాయించిన సందర్భంగా బాబు సర్కారుపై తెలుగు తమ్ముళ్లు దుమ్మెత్తిపోయటంతో జరిగిన పొరపాట్లను గుర్తించి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి మరో ఉదంతం చోటు చేసుకుంది. ఎస్పీడీసీఎల్ లో కీలకమైన లీగల్ కౌన్సిల్ పోస్టును వైసీపీ మద్దతుదారుకు కేటాయించటంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పని చేసిన వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కీలక అనుచరుడైన దినేష్ కుమార్ రెడ్డిని ఎస్పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగు చూసినంతనే తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. ఈ నియామకంపై సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేయటంతో పార్టీ వర్గాలు.. కీలక నేతలు ఒక్కసారిగా అలెర్టు అయ్యయి.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో సదరు దినేష్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరును వివరిస్తూ పోస్టులు పెట్టారు తెలుగు తమ్ముళ్లు.

2023 ఆగస్టు 4న అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటన కోసం వచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా అంగళ్ల వద్ద వైసీపీ నేతలు.. కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడటం.. ఈ సందర్భంలోనే చంద్రబాబుతో సహా వందల మంది టీడీపీ నేతలు.. కార్యకర్తలపై కేసులు పెట్టారు.

ఈ కేసుల్లో చంద్రబాబుకు.. టీడీపీ నేతలు.. కార్యకర్తలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించిన ఎపిసోడ్ లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. దినేష్ కుమార్ రెడ్డిలు కీలక భూమిక పోషించిన వైనాన్ని తెలుగు తమ్ముళ్లు తమ పోస్టుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మొదలైన రచ్చ... పార్టీ అధినాయకత్వంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహాన్ని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా.. పార్టీ పరిశీలకులు పార్టీ జిల్లా అధ్యక్షుడి సమాచారం ఇవ్వగా.. ఆ వెంటనే ఈ వ్యవహారం అధినాయకత్వం వద్దకు చేరింది.

దీనిపై స్పందించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు రియాక్టు అయ్యారు. దినేష కుమార్ రెడ్డి నియమకాన్ని రద్దు చేయటంతో పార్టీ శ్రేణులు.. టీడీపీ సానుభూతిపరులు.. మద్దతుదారులు కాస్త శాంతించారు. ఈ తరహాలో గతంలోనూ కొన్ని నామినేటెడ్ పోస్టులు కేటాయించటం.. కీలక స్థానాల్లో వైసీపీకి మద్దతుగా నిలిచే ఉన్నతాధికారులకు పోస్టింగులు ఇవ్వటం తెలిసిందే. అప్పట్లోనూ ఇదే తరహా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలానే జరిగింది. ఈ తరహాలో నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టేలా చేస్తున్నదెవరు? తాజా పోస్టుకు సిఫార్సు చేసింది ఎవరు? లాంటి అంశాలపై టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. చేతులు కాలాక ఎన్ని ఆకులు పట్టుకుంటే ఏం లాభం?