నాలుగేళ్ళ నిరీక్షణకు అద్భుత ఫలితం
జీవీఎంసీకి మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక కావడం లాంచనప్రాయం అవుతోంది. 2021లోనే ఆయన పేరుని టీడీపీ అధినాయకత్వం ప్రతిపాదించింది.
By: Tupaki Desk | 27 April 2025 8:30 PMవిశాఖ మేయర్ పదవికి టీడీపీ కూటమి నుంచి అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ ని టీడీపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయనకు బీ ఫారం అందచేసింది. ఇక మేయర్ ఎన్నిక ఈ నెల 28న సోమవారం జరగనుంది.
మొత్తం జీవీఎంసీలో 97 మంది కార్పోరేటర్లు 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా మేయర్ ని ఎన్నుకునేందుకు సింపుల్ మెజారిటీ అంటే 56 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. ఇపుడు మూడింట రెండు వంతుల మెజారిటీ కూటమికి ఉంది. దాంతో చాలా సునాయాసంగా మేయర్ గా పీలా నెగ్గిపోతారని అంటున్నారు.
జీవీఎంసీకి మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక కావడం లాంచనప్రాయం అవుతోంది. 2021లోనే ఆయన పేరుని టీడీపీ అధినాయకత్వం ప్రతిపాదించింది. మేయర్ క్యాండిడేట్ గానే పీలా బరిలోకి దిగారు. కానీ ఆనాడు వైసీపీ ఏపీలో అధికారంలో ఉంది. దాంతో విశాఖలోనూ ఆ పార్టీ గెలిచింది.
ఈ నేపధ్యంలో పీలా ఆశలు నెరవేరలేదు ఆయన టీడీపీ ఫ్లోర్ లీడర్ గానే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఆయన ఓపికగా వేచి ఉన్నందుకు మంచి ఫలితమే దక్కింది. ఇన్నేళ్ళ తర్వాత ఆయన కోరిక తీరబోతోంది. మరో వైపు చూస్తే పీలా శ్రీనివాస్ మేయర్ అభ్యర్ధిత్వం పట్ల కూటమి నేతలు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీలో ఆయనకు ఇంతటి ఉన్నత గౌరవం దక్కడం పట్ల బలమైన గవర సామాజిక వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది. తొలిసారి ఆ సామాజిక వర్గం నుంచి విశాఖ వంటి మెగా సిటీకి మేయర్ కాబోతున్నారు.
రెడ్డి, బ్రాహ్మిణ్, వెలమ, యాదవ, మత్స్యకార వర్గాల నుంచి విశాఖ కార్పోరేషన్ కి మేయర్లు అయ్యారు. కానీ మరో బలమైన సామాజిక వర్గం నుంచి మేయర్ పదవి అందని పండుగా ఉంది. టీడీపీ చాలా వ్యూహాత్మకంగా ఈ పదవిని గవరలకు కేటాయించింది. ఆ విధంగా వారి మనసుని చూరగొంది. ఇప్పటికే గవరలు టీడీపీకే జై కొడుతూ వచ్చారు. ఇపుడు వారు మరింతగా దగ్గర అవుతారు అని లెక్కలేస్తున్నారు..
ఇక రెండు డిప్యూటీ మేయర్ పదవులు ఉన్నాయి. వీటిలో ఒక దానిని యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. ఆ పదవిని టీడీపీకి చెందిన వారికే ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు. రెండవ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు.
మేయర్ ఎన్నిక అయిన తరువాత తొందరలోనే డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మొత్తం మీద చూస్తూంటే విశాఖ కార్పోరేషన్ లో కూటమి పాలన మే నెల నుంచి మొదలు కానుంది. మరో పదకొండు నెలల సమయం ఉండడంతో కొత్త మేయర్ పాలన ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అయితే సర్వత్రా వ్యక్తం అవుతోంది.