చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. మరచిపోలేని విధంగా టీడీపీ వ్యూహం
సెప్టెంబరు 9వ తేదీ.. ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎప్పుడూ గుర్తించుకునేలా అధికార టీడీపీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.
By: Tupaki Political Desk | 9 Sept 2026 1:56 PM ISTసెప్టెంబరు 9వ తేదీ.. ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎప్పుడూ గుర్తించుకునేలా అధికార టీడీపీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం సెప్టెంబరు 9న ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేశారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, విచారణకు రమ్మని పిలవకుండా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా 53 రోజుల పాటు రిమాండులో ఉంచడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబుపై సానుభూతి వెల్లువెత్తగా, ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా అఖండ విజయం సాధించారు. టీడీపీ చరిత్రతోపాటు చంద్రబాబు రాజకీయ జీవితంలోని సెప్టెంబరు 9వ తేదీ ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తూ ‘నిజం గెలిచింది’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది.
నిజం గెలిచింది ఎందుకంటే?
చంద్రబాబు అరెస్టును గుర్తు చేస్తూ ఆ చీకటి రోజును ఎప్పటికీ మరచిపోకుండా కొవ్వొత్తులు వెలిగించి మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలని టీడీపీ అధిష్టానం పార్టీ యంత్రాంగానికి పిలునిచ్చింది. దీంతో ఈ రోజు సాయంత్రం ప్రతి గ్రామంలోనూ సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ‘‘నిజం గెలిచింది’’ అన్న పేరును ఖరారు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో నిజం గెలిపించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఇక ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టిన క్షణంలో ఎమ్మెల్యేలు నిజం గెలిచింది అంటూ నినదించి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో నేటి కార్యక్రమానికి నిజం గెలిచిందని పేరు పెట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై మోపిన అభియోగాల్లో ఏ ఒక్క దానికి ఆధారాలు లేవని, చంద్రబాబుపై నమోదైన కేసులు అన్నీ అబద్దాలని చెప్పడమే కాకుండా అబద్ధంపై నిజం గెలిచిందనే విషయాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమానికి నిజం గెలిచింది అన్న పేరు పెట్టారని అంటున్నారు.
ఏటా ‘‘నిజం గెలిచింది?’’
చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఆయన అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఈ కార్యక్రమాల వల్లే రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని, చంద్రబాబుపై సానుభూతి ఎక్కువైందని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ కేడర్ ను సంఘటితం చేయడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయని అంటున్నారు. చంద్రబాబు అరెస్టుపై చలించిపోయిన కేడర్ కసితో పనిచేయడంతో తదుపరి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని అంటున్నారు. దీంతో కేడర్ లో అప్పటి పోరాట పటిమ ఎప్పుడూ కొనసాగేలా వారిలో నాటి కసి నిరంతరం గుర్తు చేసేలా ఏటా ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ భావిస్తోందని అంటున్నారు.
