పొలిట్ బ్యూరో లో ఈ పేర్లు కనిపించవా ?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్లు చాలా మంది పనిచేస్తున్నారు.
By: Tupaki Desk | 20 May 2025 11:14 PM ISTతెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్లు చాలా మంది పనిచేస్తున్నారు. వారంతా పాతికేళ్ళ వయసులో పార్టీలో చేరి ఈ రోజున ఏడు పదుల చేరువలో ఉన్నారు. వారే టీడీపీకి అత్యున్నత విధాన మండలి అయిన పొలిట్ బ్యూరోలో మెంబర్స్ గా దశాబ్దాల తరబడి కొనసాగుతున్నారు.
ఒకటి రెండు సార్లు కాదు అనేక దఫాలుగా వారే కొనసాగుతున్నారు. ఇక పొలిట్ బ్యూరో మెంబర్స్ లిస్ట్ చూస్తే పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ క్రిష్ణ మూర్తి, నిమ్మకాయల చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలక్రిష్ణ, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకటరావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎండీ షరీఫ్, బోండా ఉమామహేశ్వరరావు, ఎస్ ఎం డీ ఫరూఖ్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఇక ఎక్స్ అఫీషియోగా కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్ధనరావు ఉన్నారు.
మరి కొద్ది రోజులలో టీడీపీ మహానాడు జరగనుండగా పొలిట్ బ్యూరో మీద అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొలిట్ బ్యూరోలో అతి పెద్ద మార్పులు ఉంటాయని వార్తలు వినవస్తున్నాయి. సీనియర్లకు ఈసారి చెక్ పెడతారని ఆ ప్లేస్ లోకి కొత్త వారు జూనియర్లు వస్తారని అంటున్నారు.
మరి సీనియర్లు ఎవరిని తప్పిస్తారు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. అలాగే పొలిట్ బ్యూరోలో ఉన్న వారిలో కొందరు మంత్రులుగా ఉన్నారు, దాంతో వారిని కూడా తప్పిస్తారు అని అంటున్నారు. ఫ్రెష్ లుక్ తో యూత్ ఎక్కువగా ఉండేలా ఈసారి పొలిట్ బ్యూరో నిర్మాణం జరుగుతుంది అని అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ టీం తో పొలిట్ బ్యూరో ఉంటుంది అని అంటున్నారు. దాంతో సీనియర్లకు ఇక రెస్ట్ అన్న చర్చ వినిపిస్తోంది ఇంతకాలం మంత్రులుగా కాకపోయినా పార్టీలో అత్యున్నత హోదా కలిగిన దాంట్లో తాము మెంబర్స్ గా ఉన్నామని సీనియర్లు ఎంతో కొంత సంతృప్తి చెందేవారు. కానీ ఇపుడు అది కూడా లేకుండా పోతే సీనియర్లు ఏమి చేయాలన్నదే ప్రశ్న. అయితే వారి అనుభవాన్ని పార్టీ ఏదో రూపంలో వాడుకుంటుంది అని అంటున్నారు. మరి సీనియర్లకు ఏ విధంగా దారి చూపుతారో తెలియదు కానీ ఈసారి పొలిట్ బ్యూరోలో కొత్త ముఖాలు ఎక్కువగా రావడం ఖాయమన్న మాట అయితే వినిపిస్తోంది. సో చూడాలి మరి ఏమి జరుగుతుందో.
