మరింత స్ట్రాంగ్‌గా టీడీపీ.. !
కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టిడిపి మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.
By: Garuda Media | 24 April 2026 12:22 PM ISTకూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టిడిపి మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని అదేవిధంగా జాతీయస్థాయి నాయకత్వాన్ని కూడా నియమించింది. ఇక ఇప్పుడు ప్రాంతాలవారీగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం పెంచుతోంది. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పార్టీ ఆఫీసులు లేకపోవడం తెలిసిందే.
ఉమ్మడి 13 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మరో 13 జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పడిన రెండు జిల్లాలతో కలిపి మొత్తంగా 28 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలను నిర్మించే దిశగా ప్రణాళికను రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా జిల్లాలలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఇక ఇదే సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉన్న మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనను జాతీయస్థాయి పార్టీ కార్యాలయంగా మార్చనున్నట్లు తెలిసింది.
తద్వారా జాతీయస్థాయి నాయకులు, అదే విధంగా జాతీయ రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాల కు ఈ భవనాన్ని కేటాయించనున్నారు. ఇప్పటి వరకు వాస్తవానికి జాతీయస్థాయి రాజకీయాలైనా రాష్ట్ర స్థాయి రాజకీయాలైన ఎన్టీఆర్ భవన్లోనే కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ భవనం కేవలం జాతీయస్థాయి రాజకీయాలకు కేటాయించి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వేరే చోట నిర్మించాలని నిర్ణయించారు. అది కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి సమీపంలోని అత్యంత ఆధునిక నిర్మాణంతో చేపట్టాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
దీనికి సంబంధించి ఇప్పటికే భూమిని కూడా సహకరించారని ప్రణాళిక సిద్ధమైందని మహానాడు సందర్భంగా ఈ కార్యాలయానికి భూమి పూజ చేయవచ్చని పార్టీ కీలక నాయకుడు ఒకరు వెల్లడించారు. అదే సమయంలో కొత్త జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి వాటిలో కూడా మహానాడు వేదికగా భూమి పూజ చేసి నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మొత్తంగా ఒకవైపు పార్టీ నిర్మాణంతోపాటు పార్టీకి పక్కా భవనాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత బలోపేతం చేసే దిశగా టిడిపి అడుగులు వేస్తోంది అన్నది స్పష్టం అవుతోంది.
