Begin typing your search above and press return to search.

బీసీల‌పై టీడీపీ స్ట్రాట‌జీ.. !

బీసీల‌పై స‌రికొత్త వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు టీడీపీ రెడీ అయింది. బీసీ సామాజిక వ‌ర్గంలో ఉన్న అసంతృప్తిని త‌గ్గించి.. వారిని త‌న‌వైపు పూర్తిగా తిప్పుకొనే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

By:  Garuda Media   |   7 Aug 2026 5:00 AM IST
బీసీల‌పై టీడీపీ స్ట్రాట‌జీ.. !
X

బీసీల‌పై స‌రికొత్త వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు టీడీపీ రెడీ అయింది. బీసీ సామాజిక వ‌ర్గంలో ఉన్న అసంతృప్తిని త‌గ్గించి.. వారిని త‌న‌వైపు పూర్తిగా తిప్పుకొనే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిలో భాగంగానే బీసీ మంత్రుల‌తో భారీ క‌మిటీని ఏర్పాటు చేసింది. దీనిలో కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌, కొల్లు ర‌వీంద్ర స‌హా.. పలువురు మంత్రుల‌ను చంద్ర‌బాబు నియ‌మించారు. వీరు బీసీల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌నున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌లో తొలి స‌మావేశం కూడా నిర్వ‌హించారు.

ఏంటి ల‌క్ష్యం..?

బీసీల‌ను సెంట్రిక్‌గా చేసుకుని వైసీపీ కొత్త ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. బీసీలే త‌మ వెన్నెముక అంటూ.. టీడీపీ ప్ర‌చారం చేస్తోంద‌ని, కానీ, వారికి అన్ని విధాలా అన్యాయం చేస్తున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారంచేసేందుకు రెడీ అవుతున్నారు. స‌మాజంలో ఎక్కువ‌గా ఉన్న బీసీల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేం దుకు.. అదేస‌మ‌యంలో టీడీపీకి దూరం చేసేందుకు ఈ వ్యూహాన్ని అమ‌లు చేయాల‌న్న‌ది వైసీపీ నాయ కులు బ‌హిరంగంగానే చెబుతున్న మాట‌. దీనిపై ప్ర‌స్తుతం క‌స‌రత్తు సాగుతోంది.

అయితే.. వైసీపీకి ఈ చాన్స్ ఇవ్వ‌కుండా.. బీసీల విష‌యంలో అన్నీ తామై వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది టీడీపీ స్ట్రాట‌జీ. అంటే.. స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించ‌డంతోపాటు.. వాటి ప‌రిష్కారాల‌ను కూడా ప్ర‌భుత్వంతో చ‌ర్చించా ల‌ని నిర్ణ‌యించారు. ఇది వైసీపీ వేసిన రాజ‌కీయ పాచిక‌కు కౌంట‌ర్ ఎత్తుగ‌డ‌గానే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో బీసీ సామాజిక వ‌ర్గం నేత‌లు, మంత్రులు స‌విత వంటివారితో క‌మిటీని ఏర్పాటు చేశారు. దీనిలో బీసీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించ‌డంతోపాటు.. వాటిని ప‌రిష్క‌రించేందుకు ఉన్న మార్గాల‌ను కూడా వీరే అన్వేషిస్తారు.

ముఖ్యంగా `బీసీ ర‌క్ష‌ణ చ‌ట్టం` తీసుకురానున్న నేప‌థ్యంలో వైసీపీకి కౌంట‌ర్‌గా ఏర్ప‌డిన ఈ క‌మిటీకి చం ద్రబాబు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. బీసీల‌కు చేరువ కావ‌డం.. వారి స‌మ‌స్య‌ల‌తోపాటు ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మంచిని వివ‌రించాలి. అదేస‌మ‌యంలో బీసీలలో టీడీపీపై ఉన్న సానుభూతిని మ‌రింత పెంచాల్సి ఉంటుంది. వైసీపీ వేసే ప్ర‌తి అడుగును అంచ‌నా వేసి.. దానికి కౌంట‌ర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల స‌మ్మేళ‌నాలు.. స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. మొత్తంగా ఇది బీసీల్లో టీడీపీకి ఉన్న ప‌ట్టును నిల‌బెట్టుకునే దిశ‌గానే సాగ‌నుంది.