Begin typing your search above and press return to search.

ఔట్ అయ్యేది వీరేనా? మహనాడులో సమూల మార్పులు షురూ..

టీడీపీ మహానాడుతో పార్టీలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 May 2025 5:00 PM IST
ఔట్ అయ్యేది వీరేనా? మహనాడులో సమూల మార్పులు షురూ..
X

టీడీపీ మహానాడుతో పార్టీలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వనున్నారని అంటున్నారు. పార్టీ అవసరాల దృష్ట్యా లోకేశ్ ను పార్టీ వర్కింగు ప్రెసిడెంటుగా నియమించేలా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మినీ మహానాడుల్లో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమై, పార్టీ బాధ్యతలు అన్నీ లోకేశ్ కు అప్పగించాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు పార్టీకి యువరక్తం ఎక్కించేలా పొలిట్ బ్యూరోను సమూలంగా సంస్కరించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడి తర్వాత పొలిట్ బ్యూరో మెంబర్ కి అధిక ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. దీంతో టీడీపీ వరకు పొలిట్ బ్యూరో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. పార్టీలో సీనియర్లు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు పొలిట్ బ్యూరోలో ఉంటారు. అయితే పొలిట్ బ్యూరోలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యువనేత లోకేశ్ చాలా కాలంగా ప్రతిపాదిస్తున్నారు. అవసరమైతే తాను కూడా తప్పుకుంటానని కొత్తవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వాల్సిందేనంటూ ఆయన గళం వినిపిస్తున్నారు.

రెండు దఫాలు కన్నా ఎక్కువ సార్లు ఒక వ్యక్తి ఒకే పదవిలో ఉండకూడదనేది లోకేశ్ ఆలోచనగా చెబుతున్నారు. దీంతో పొలిట్ బ్యూరోతోపాటు పార్టీ కార్యవర్గంలో దశాబ్దాలుగా పదవుల్లో కొనసాగుతున్న నేతలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కొందరు పొలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు, కిమిడి కళావెంకటరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ క్రిష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎండీ షరీఫ్, నక్కా ఆనంద్ బాబు, సీనియర్ నేత వర్ల రామయ్య, ప్రస్తుత మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వంటి వారు ఉన్నారు. వీరిలో చాలా మంది వయసు ఏడు పదులకు అటు ఇటు ఉంది. దీంతో వీరిందరికి విశ్రాంతి ఇవ్వాలని పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది.

పొలిట్ బ్యూరోలో ప్రస్తుతం 22 మంది శాశ్వత సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, సీనియర్ నేత టీడీ జనార్దన్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. 22 మంది శాశ్వత సభ్యుల్లో కొద్ది మంది మాత్రమే చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో బొండా ఉమ, గల్లా జయదేవ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కొల్లు రవీంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి మరోసారి రెన్యువల్ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు సమకాలీకులు అంతా పొలిట్ బ్యూరో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని సూచనలు వస్తున్నాయని అంటున్నారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు క్రియాశీల రాజకీయాలకు చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా కేఈ క్రిష్ణమూర్తి కూడా వయసురీత్యా గతం మాదిరిగా పనిచేయలేకపోతున్నారు. అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉండటంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక యనమల కూడా ప్రత్యక్ష రాజకీయాలు చేయడం లేదు. అయితే ఆయనను పార్టీ పదవిలో కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా? అనేది చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్సీ పదవీకాలం రెన్యువల్ చేయకపోవడంపై ఆయన పార్టీపై అసమ్మతి వ్యక్తం చేశారు. అయితే రాజ్యసభ స్థానం వస్తుందనే ఆశతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో యనమలను తప్పించకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో 25 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఎంత కాదన్నా 15 మందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన చర్చిస్తున్నారు. అయితే కొత్తవారు పూర్తిగా భావినేత లోకేశ్ కు విధేయులుగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో మహానాడు మూడు రోజుల తర్వాత టీం లోకేశ్ చేతికి టీడీపీ పగ్గాలు పూర్తిగా అప్పగిస్తారని అంటున్నారు.